ఎక్కడున్నా.. చింతమడక బిడ్డనే!

CM KCR Comments On Chintamadaka - Sakshi

ఊరి రుణం తీర్చుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడను 

పగలు, ప్రతీకారాలు వద్దు.. ఆత్మీయంగా బతుకుదాం 

వలసపోయినోళ్లనూ రప్పించండి.. ఆదుకుందాం 

గ్రామంలో ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున లబ్ధి 

ఊర్లో అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశం 

గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం 

ఎక్కడికెళ్లినా.. నా సొంతూరుకు వచ్చినంత ఆనందం ఇంకెక్కడా ఉండదు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. ఊరిలో కలియ తిరిగి అందరిని కలుసుకోవాలి. ఆప్యాయంగా మాట్లాడానే కోరిక చాన్నాళ్ల తర్వాత నెరవేరింది.    – కేసీఆర్‌

సాక్షి, సిద్దిపేట : ‘నాడు ఉద్యమ నాయకుడిగా, నేడు సీఎంగా నేను ఎక్కడున్నా.. మీ ఊరి బిడ్డనే. చింతమడక చనుబాలు తాగి బతికిన వాడిననే విషయం మరిచిపోను. మీకు ఎంత సేవ చేసినా రుణం తీర్చుకోలేను’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘నేను ఈ స్థాయికి రావడంలో సహకరించిన చింతమడక తల్లులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, చదువు చెప్పిన గురువులు.. అందరికీ పేరు పేరునా వందనాలు. నేను పుట్టి పెరిగిన ఊరు బాగుండాలి. నా గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి’అని ఉద్వేగంగా చెప్పారు. ‘ఇక్కడి ప్రతీ ఇంటితో ఉన్న అనుబంధం, చెట్టు, పుట్ట, ఊటబావులు దేన్నీ మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను పెద్దవాడిని చేసిన ప్రజలకు, విద్య బుద్ధులు చెప్పిన గురువులకు రుణపడి ఉంటాను. ఎక్కడ ఉన్నా చింతమడక బిడ్డనే’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. అందుకోసమే ఈ గ్రామాభివృద్ధి తన బాధ్యతన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఏర్పాటు చేసిన గ్రామ ప్రజల ఆత్మీయ, అనురాగ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా గ్రామంలోని ప్రతీ ఒక్కరు గౌరవంగా బతకాలన్నదే నా కోరిక. ఇందుకోసం ఎన్ని డబ్బులైనా మంజూరు చేస్తా’అని కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం చింతమడక, ఉప్పలోనికుంట, దుమ్మచెరువులే కాకుండా మచాపూర్, సీతారాంపల్లి కూడా మన గ్రామాలేనన్నారు. చింతమడక గ్రామ పంచాయతీ పరిధిలో 904 కుటుంబాలు, సీతారాంపల్లి, మాచాపూర్‌ గ్రామాల్లో 900 కుటుంబాలు మొత్తం 1,804 కుటుంబాలు మనవేనన్నారు. గ్రామంలో బతుకలేకనే ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని.. వారిని కూడా ఫోన్‌ చేసి పిలిపించాలని చెప్పారు. వలస వెళ్లిన వారితో కలుపుకొని మొత్తం 2వేల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి రూ.10లక్షలకు తక్కువ కాకుండా లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ.200కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. గ్రామాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీక మాసంలో మళ్లీ కుటుంబంతో కలిసి ఊరికి వస్తానన్నారు. 
 
ఆలోచించి యూనిట్లు తీసుకోండి 
‘ఈ ఊరి మట్టిలో పుట్టినోన్ని. ఇక్కడి నీళ్లు తాగినోణ్ణి. ప్రజల కళ్లలో, చేతుల్లో మెదిలినోణ్ణి. అందుకోసమే మీకు ఎంత చేసినా తక్కువే’అని కేసీఆర్‌ అన్నారు. గ్రామానికి ఇస్తున్న డబ్బుల విషయంలో ఆగమాగం కావొద్దని.. ఆలోచించి యూనిట్లు తీసుకోవాలని సూచించారు. వరినాట్లు వేసే యంత్రాలు, కోసే యంత్రాలు, హార్వెస్టర్లు, పౌల్ట్రీఫాం, ట్రాక్టర్లు, డీసీఎంలు, డైరీఫాం ఇలా మీ కుటుంబాలకు అనువైనవి తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయాధారిత కుటుంబాలు ఎక్కువున్నాయి కాబట్టి పాడి గేదెలు పెంచుకోవాలని చెప్పారు. ఇందుకోసం చింతమడకలో శీతలీకరణ కేంద్రం, ప్రాసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. వీటితోపాటు గ్రామానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని యువజన, కుల సంఘాలు, మహిళలు, పెద్దలు సమావేశాలు పెట్టుకొని నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. మీ బాగు కోసం నిధులు కేటాయిస్తే ఎవరూ ఏమనరని, ఒకవేళ ఎవరైనా అన్నా తాను పట్టించుకోనన్నారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తానని చెప్పారు. మొత్తం 1,500 నుండి 2 వేల వరకు కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతా కలిసికట్టుగా ఉండి ఊరును అందంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. పగలు, కక్షలు పెట్టుకోవద్దని, ఆప్యాయంగా ఉంటేనే ఊరు అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు ఎర్రవల్లిని ఆదర్శంగా తీసుకోవాలని, అంతకంటే గొప్పగా చింతమడక కావాలని ఆకాంక్షించారు. 
 

చింతమడకతోపాటు.. 
తనకు జన్మనిచ్చిన చింతమడకతోపాటు పెద్ద బాలశిక్ష చదువుకున్న సిరిసిల్ల జిల్లా గూడురు, తోర్నాల, పుల్లూరు, దుబ్బాకకు కూడా రణపడి ఉంటానని కేసీఆర్‌ చెప్పారు. తన గ్రామంతోపాటు దుబ్బాక పట్టణ అభివృద్ధికి రూ.10 కోట్లు, గూడూరుకు తోర్నాల, పుల్లూరు గ్రామాలకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక్కడికి వచ్చే ముందే స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌తో మాట్లాడి వచ్చానని, వారు పూర్తి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. 
 
రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి 
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని వైద్యరంగంలోనూ ముందుకు తీసుకెళ్లాలన్నదే తన అభిమతమని కేసీఆర్‌ అన్నారు. చింతమడకలో అందరికీ వైద్య పరీక్షలు చేయించాలని, అందుకు కార్పొరేట్‌ ఆస్పత్రుల ద్వారా క్యాంపులు పెడతామని చెప్పారు. గ్రామంలో ప్రతిఒక్కరి ఆరోగ్య ప్రొఫైల్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో సిద్దిపేటలో అమలు చేసిన తాగునీటి పథకం ఇప్పుడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచి అందరి దాహం తీర్చే మిషన్‌ భగీరథగా మారిందని.. అలాగే చింతమడకలో అంకురార్పణ చేసిన ఆరోగ్య ప్రొఫైల్‌ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. అమెరికా వంటి దేశాల్లో అందరి ఆరోగ్య ప్రొఫైల్‌ ఉంటుందని. దీంతో వ్యాధులు నివారణ, వైద్యం సులువవుతుందని సీఎం చెప్పారు. అటువంటి పద్ధతి రాష్ట్రమంతటా అమలు చేస్తామని అన్నారు. 
 
సంవత్సరానికి మూడు పంటలు 
కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందన్నారు. గోదావరి జలాలు బీడు భూములకు పారించాలన్నదే తన ధ్యేయమని సీఎం చెప్పారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్లు పూర్తి చేసి చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంటే నీటి ఊటలకు ప్రాణం వస్తుందని కేసీఆర్‌ వివరించారు. దీంతో సంవత్సరానికి మూడు పంటలు పండే గ్రామాల్లో చింతమడక కూడా ఉంటుందని, ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని చెప్పారు. 
 
ఆ ఆనందం ఎక్కడా లభించదు 
‘ఎక్కడికెళ్లినా.. నా సొంతూరుకు వచ్చినంత ఆనందం ఇంకెక్కడా ఉండదు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. ఊరిలో కలియ తిరిగి అందరిని కలుసుకోవాలి. ఆప్యాయంగా మాట్లాడానే కోరిక చాన్నాళ్ల తర్వాత నెరవేరింది’అని కేసీఆర్‌ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టినప్పుడు ఎంతో ఆనందం కల్గిందన్నారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా బీమా సౌకర్యం అందుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం మన రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినందుకు సంతోషపడ్డానని చెప్పారు. వీటికోసం ఎంత ఖర్చయినా వెనకాడేది లేదన్నారు. అందరికి పక్కా ఇండ్లు నిర్మించాలని, ప్రతీ కుటుంబానికి రూ.10లక్షలకు తక్కువ కాకుండా వారి అభిరుచికి అనుగుణంగా స్వయం సంవృద్ధి పథకాలు అమలు చేయాలని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50కోట్లు, వ్యక్తిగత పథకాలకోసం రూ.200కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పనులు వేగంగా జరగాలని, కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి శుభాష్‌రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాసరావు, సీపీ జోయల్‌ డేవీస్‌ తదితరులు పాల్గొన్నారు.  
 
 కిష్టన్న బాగున్నడా? రాజయ్య ఏం చేస్తుండు? 
సోమవారం చింతమడకలో పర్యటించిన కేసీఆర్‌.. గ్రామానికి వచ్చీరాగానే.. చిన్ననాటి మిత్రులు, బంధువులు, గురువులను చూడగానే మైమరచిపోయారు. సభావేదికపైకి వెళ్లకుండా.. సభలో కూర్చున్న వారి వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరించారు. పడిగల ఆనందం వద్దకెళ్లి ‘ఎలా ఉన్నారు? కిష్టన్న బాగున్నడా? ఇక్కడికి రాలేదా?. అందరూ బాగున్నరా’అని అడిగారు. వృద్ధుడైన రాజయ్య వద్దకు వెళ్లి ‘బాగున్నవా? అంతా బాగున్నరా? కోస రాజయ్య ఏం చేస్తుండు?’అని ఆరా తీశారు. గ్రామంలో ఇలా అందరినీ పేరు పేరున పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తన ఇంటిని గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో మొక్కను నాటారు. అక్కడి నుంచి రామాలయాన్ని చూపుతూ మాజీ మంత్రి హరీశ్‌రావుతో చర్చించారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు. బాగు చేయండి’అని సూచించారు. గురువు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. శివాలయం వద్దకు వెళ్లి ‘గుడిని మంచిగా కట్టుకుందాం. ఎస్టిమేట్‌ తయారు చేయండి’అని ఆదేశించారు. అలా నడుస్తూనే గ్రామంలో కలియతిరిగారు. మిత్రులు, పెద్దలు, వృద్ధుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఎన్ని డబ్బులైనా వెనకాడేది లేదని చెప్పారు. గ్రామస్తులు పగలు, పంతాలు వీడి ఒకే కుటుంబంగా ఉండాలని ప్రేమ, ఆప్యాయతలు పంచుకోవాలని సూచించారు. అనంతరం రూ.10 కోట్లతో నిర్మించే బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. యూపీఎస్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు. 

మీ చేతిలో పెరిగిన బిడ్డే! 
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు 
చింతమడక కన్నబిడ్డ, మీ చేతిలో పెరిగిన బిడ్డ.. నేడు రాష్ట్ర ప్రజల కన్నీరు తుడిచే నాయకుడయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు సాగిన ఉద్యమంలో గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తే కేసీఆర్‌ సమర్థ నాయకత్వానికి కారణమన్నారు. ‘రాష్ట్ర సాధనలో భాగంగా నిరాహర దీక్షలో ఉన్న కేసీఆర్‌ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంటే.. చింతమడక గొల్లుమందన్నారు. ఈ గ్రామం నుంచి పోచయ్య, నారాయణరెడ్డి ఫోన్‌ చేసి మా బిడ్డ ఎట్లున్నడని అడిగితే నాకు దుఃఖం వచ్చింది’అని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్‌ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఈ ఊళ్లో పొయ్యి వెలిగించకుండా ఉన్న రోజులు గుర్తున్నాయని అన్నారు. అందరు తమ అడ్రస్‌ను పలానా ఊరు అని చెబుతారని, కానీ ఇక్కడి ప్రజలు మాత్రం తమది కేసీఆర్‌ ఊరని చెప్పడం అందరికి గర్వకారణమన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండికూడా కేసీఆర్‌ ఇక్కడ వ్యవసాయం చేసిన విషయాన్ని హరీశ్‌ రావు గుర్తు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top