వేలిముద్ర వేస్తేనే.. సన్న బియ్యం | Civil Supplies Department Bought Online Distribution | Sakshi
Sakshi News home page

వేలిముద్ర వేస్తేనే.. సన్న బియ్యం

Aug 6 2019 11:54 AM | Updated on Aug 6 2019 11:56 AM

Civil Supplies Department Bought Online Distribution - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడంలో భాగంగా గతేడాది నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఈ బియ్యం దారిమళ్లుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సన్నబియ్యం వినియోగంలో అక్రమాలను అరికట్టేందుకు నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయా ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లేదా, వార్డెన్, డిప్యూటీ వార్డెన్లు బియ్యం సరఫరా ఆవుతున్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద వేలిముద్ర వేస్తేనే సన్నబియ్యం విడుదలయ్యేలా నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్‌ సెంటర్‌ వెబ్‌సైట్‌ అభివృద్ధి చేసింది. ఆగస్టు1 నుంచి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకు వచ్చింది. జీసీసీ ద్వారా ఆశ్రమ పాఠశాలలకు బియ్యం సరఫరాకు స్వస్తి చెప్పనున్నారు. జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే ఆగస్టు కోటా సన్నబియ్యం అందుతాయి. 

ఉపాధ్యాయుల వేలిముద్రతోనే..
ఇప్పటికే రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ యంత్రాలను ఉపయోగించి కార్డుదారుల వేలిముద్రలు వేసిన తర్వాతే బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదే విధానాన్ని ఆశ్రమ పాఠశాలలకు వర్తింపజేస్తున్నారు. వెబ్‌సైట్‌తో పాటు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఆయా ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లేదా వార్డెన్, డిప్యూటీ వార్డెన్లు వారి వేలిముద్రలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద పెడితేనే బియ్యం సరఫరా చేయనున్నారు. దీనికి సంబంధించి రెండునెలల కిందటే శిక్షణ ప్రక్రియ కొనసాగింది. ఆయా ఆశ్రమ పాఠశాలల వివరాలను ఏటీడీవోల ద్వారా ఐటీడీఏకు పంపించారు. వారు అక్కడి నుంచి ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌కు పంపించారు. ఆ తర్వాత ప్రతినెలా సీబీ (క్లోజింగ్‌ బ్యాలెన్స్‌) నిల్వ ఉన్న బియ్యం వివరాలు యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో సూచించిన నమూనాలో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెలలో ఎంతబియ్యం పాఠశాలకు కేటాయించాలనేది ఆన్‌లైన్‌లోనే లెక్క తేలుతుంది. అటోమెటిక్‌గా ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, నిల్వ ఉన్న బియ్యం ఆధారంగా మరుసటి నెలకు కావాల్సిన బియ్యం కేటాయింపులు ఖరారు అవుతుంది. ఆగస్టు నుంచి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బియ్యం సైతం తీసుకుంటున్నారు.

ఇలా చేరుతుంది.. 
ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం లేదా వార్డెన్, డిప్యూటీ వార్డెన్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత వరుసగా అప్రువల్‌ చేస్తారు. అనంతరం పాఠశాలల వివరాలు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వస్తాయి. వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైన ఆశ్రమ పాఠశాలలకు అక్కడి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం కేటాయిస్తారు. ఈ మేరకు జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆయా ఎంఎల్‌ఎస్‌లో బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచుతారు. ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు వీరిలో ఎవరైనా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వెళ్లి అక్కడి ఈ–పాస్‌ యంత్రంపై వేలిముద్ర వేసిన తర్వాతే ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. అప్పుడే బియ్యం సరఫరాకు అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలలకు అధికారులు బియ్యం సరఫరా చేస్తారు.

ఇప్పటికే శిక్షణ పూర్తి 
ఈ–పాస్‌ విధానం అమలుపై జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే అధికారులు శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం 54 ఆశ్రమ పాఠశాలలు ఉండగా ఇందులో 22 బాలికల, 32 బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 17వేల మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వారి వివరాలు సంబంధిత ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారు. ఆగస్టు నుంచి నూతన విధానం సైతం అమలులోకి వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో కేటాయింపులు
జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇదివరకే రెండునెలల పాటు శిక్షణ సైతం ఇప్పించాం. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేస్తేనే ఆయా పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా అవుతాయి. ఇప్పటికే కొన్ని ఆశ్రమ పాఠశాలలు ఆన్‌లైన్‌ విధానం ద్వారా సన్నబియ్యం తీసుకెళ్తున్నాయి.   – చందన, డీడీ ఐటీడీఏ, ఉట్నూర్, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement