సిటీ పల్లెటూర్‌

City People Started Journey To Hometown On Occasion Of Sankranti - Sakshi

బస్సులు, రైళ్లలో మొదలైన రద్దీ

సుమారు 20 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు

ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనం

ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు

ప్రత్యేక రైళ్లలోనూ అదనపు చార్జీలు

విమాన ప్రయాణాలకు పెరిగిన డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: మహానగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రధాన రైల్వేస్టేషన్‌లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ శుక్రవారం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు రైల్వేతో సహా, ఆర్టీసీ, ప్రైవేట్‌ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ప్రైవేట్‌ రైళ్లలో ప్రత్యేక చార్జీలను విధించారు.

200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు పెంచగా, రాష్ట్రంలోని (200 కి.మీ. లోపు) ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో 10 నుంచి 20 శాతం వరకు చార్జీలను పెంచారు. ఇక ప్రైవేట్‌ బస్సులు యథావిధిగా దారి దోపిడీ సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 20 లక్షల మందికిపైగా తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. పండుగ రద్దీ విమానాలను సైతం తాకింది.

ఆర్టీసీ 50 శాతం అదనం...
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ 3,500 రెగ్యులర్‌ బస్సులకు తోడు సుమారు 5,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి తదితర దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 50 శాతం, తెలంగాణలోని వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో 10 నుంచి 20 శాతం అదనపు చార్జీలు విధించారు. ఇప్పటికే అన్ని రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు రిజర్వ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఇవి నగర శివార్ల నుంచే బయలు దేరేలా కార్యచరణ చేపట్టినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు.

ప్రైవేట్‌ ఆపరేటర్ల దారి దోపిడీ...
నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్‌ బస్సుల్లో చార్జీలు రెట్టింపయ్యాయి. ఒక్కో ట్రావెల్స్‌ సంస్థ ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి సాధారణ రోజుల్లో రూ.750 వరకు ఉంటే ఇప్పుడు రూ.1,350కి పెంచారు. రాజమండ్రికి సాధారణంగా రూ.900 వరకు ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ట్రావెల్స్‌ రూ.1,800, మరికొన్ని రూ.2,090 వరకు వసూలు చేస్తున్నాయి.

ఫ్లైట్‌ జర్నీకి సైతం డిమాండ్‌...
పలు రూట్లలో ప్రయాణికుల డిమాండ్‌ పెరగడంతో విమాన చార్జీలు సైతంపెరిగాయి. ఈ నెల 13న హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు చార్జీ ఉండగా, తిరుపతికి రూ.4,600 వరకు ఉంది. ఇక రాజమండ్రికి రూ.11,339 వరకు చార్జీలున్నాయి. ఏ రోజుకు ఆ రోజు డిమాండ్‌ మేరకు చార్జీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ప్రతిరోజు సుమారు 40 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుండగా, పండుగ రద్దీ దృష్ట్యా ఈ సంఖ్య మరో 5 వేలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు.  మరోవైపు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ ప్రజలు భారీగా స్వగ్రామాలకు వేళ్తుండడంతో  జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది.

రైళ్లలో చార్జీలు ‘ప్రత్యేక’ం
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లలో సంక్రాంతి రద్దీ ప్రారంభమైంది. సాధారణ రోజుల్లో రాకపోకలు సాగించే సుమారు 120 రైళ్లతో పాటు సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను ఏర్పాటు చేశారు. మార్చి వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలోనూ వందల్లో వెయిటింగ్‌ లిస్టు దర్శనమిస్తోంది. ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలపైన 30 శాతం అదనపు బాదుడుకు తెరలేపారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు థర్డ్‌ ఏసీ రూ.645. ప్రస్తుతం ఈ ప్రత్యేక చార్జీలు రూ.1,130 వరకు పెరిగాయి. అలాగే విశాఖకు స్లీపర్‌ రూ.395 ఉండగా ప్రత్యే రైళ్లలో రూ.500కు పెరిగింది. ఇలా అన్ని రూట్లలోనూ స్పెషల్‌ ట్రైన్స్‌లో చార్జీలు పెంచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top