ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఇబ్రహీంపట్నం రానున్నారు...
ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఇబ్రహీంపట్నం రానున్నారు. రుచి దాబా వెనుక ఉన్న విశాలమైన మైదానంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘పట్నం’ అభివృద్ధికి ఏమేం హామీలు ఇస్తారోనని.. ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో తిష్టవేసిన సమస్యలకు సోమవారం నాటి సీఎం సభతోనైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వీటికి పరిష్కారం లభించేనా?
- ‘పట్నం’ మీదుగా మాల్ వరకు ప్రతిపాదనలో ఉన్న నాలుగులేన్‌ల రహదారి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది.
- ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల భవన సముదాయాలను పది ఎకరాల స్థలంలో నిర్మించాలన్న నేతల హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
- కృష్ణా జలాల సరఫరా, పారిశ్రామిక సంస్థల్లో స్థానికులకు ఉపాధి తదితర సమస్యలు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రోద్భలంతోనే ముఖ్యమంత్రి ‘పట్నం’ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరిక తర్వాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు. దాదాపు 40వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీస్థాయిలో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది.