ఎంసెట్‌ కేసులో చార్జిషీట్‌.. 

Chargesheet in the case of Eamcet Question paper Leakage case - Sakshi

త్వరలో దాఖలు చేసేందుకు సీఐడీ సిద్ధం 

గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన న్యాయవిభాగం 

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎట్టకేలకు సీఐడీ చార్జిషీట్‌ దాఖలు చేయనుంది. మూడేళ్లుగా నానుతూ వస్తున్న దర్యాప్తు కొద్ది రోజుల క్రితం పూర్తి కావడంతో పట్టుబడిన నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనితో సీఐడీ దర్యాప్తు బృందం ఇప్పటివరకు కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారులు, బ్రోకర్లు, కాలేజీ ప్రతినిధులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి పేర్లను సైతం చేర్చి దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ కొద్ది రోజుల క్రితమే తయారుచేసిన సీఐడీ అధికారులు న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు లీగల్‌ విభాగానికి పంపించారు. చార్జిషీట్‌ డ్రాప్ట్‌ను అధ్యయనం చేసిన న్యాయవిభాగం అధికారులు కొన్ని సాంకేతిక కారణాలను ఎత్తిచూపారు. వీటిని సరిచేసుకున్న దర్యాప్తు బృందం నాంపల్లిలోని సీఐడీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేసులో 124 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ 94 మందిని అరెస్ట్‌ చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారులుగా 22మంది ఉండగా, మిగిలిన వారంతా బ్రోకర్లని సీఐడీ లెక్క తేల్చింది.  

మరో దఫా దర్యాప్తు... 
ప్రస్తుతం దాఖలు చేస్తున్న చార్జిషీట్‌ తుదిది కాదని, మరో దఫా దర్యాప్తు ఉంటుందని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ కేసులో ఇంకొంత మంది పాత్ర తేలాల్సి ఉందని, గతంలో దర్యాప్తు అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కొంత మంది నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వారి కోసం వేటసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.మరికొంత మంది బ్రోకర్ల పాత్ర సైతం పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సి ఉందని, వారినీ అరెస్ట్‌ చేసి అనుబంధ చార్జిషీట్‌ కూడా దాఖలు చేసేందుకు తాము కృషిచేస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా సాగుతూ.. వస్తున్న ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరు మృతి చెందడం, కేసులో అనేక ప్రతిష్టంభనలకు కారణమైంది. 312మంది విద్యార్థులకు కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, కటక్, ముంబై, పుణేలో క్యాంపులు నిర్వహించి లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇప్పించిన సంగతి విదితమే.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top