‘ఆ చెరువును కాపాడతా’

Chamakura Malla Reddy Promises to Protect Annarayan Cheruvu - Sakshi

మంత్రి చామకూర మల్లారెడ్డి

సాక్షి, మేడ్చల్‌: నాగారంలోని అన్నరాయని చెరువు పరిరక్షణకు కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి హామీయిచ్చారు. అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శనివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన డ్రైనేజీని మళ్లించి, పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. చెరువు చుట్టూ కట్ట నిర్మించి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటించాలని మంత్రికి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

గతంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువు అభివృద్ధి పనులకోసం విడుదలయిన నిధుల గురించి ఆరా తీస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అప్పటికప్పుడు నాగారం మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి చెరువును పరిశీలించి పరిరక్షణ సమితి అడిగిన పనుల గురించి వివరాలు తెలియచేయలని ఆదేశించారు. పరిరక్షణ సమితి సభ్యులు ఇచ్చిన అభ్యర్థనపై మేడ్చల్-మల్కాజ్‌గిరి నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ స్పందించాలని సూచించారు.

మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో మామిడాల ప్రశాంత్, కొమిరెల్లి సుధాకర్‌ రెడ్డి, బోగి వెంకట్, విజయశేఖర్, వీరేశం, కృష్ణమాచార్యులు, మల్లారెడ్డి, రఘుపతి, శర్మ, వివేక్, శ్రీనివాసరెడ్డి, సుధాకర్, నరసింహులు తదితరులు ఉన్నారు. తర్వాత పరిరక్షణ సభ్యులు నాగారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి మంత్రికి ఇచ్చిన వినతిపత్రాన్ని అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top