
సాక్షి, హైదరాబాద్: ఎల్‌బీ నగర్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఆర్టీసి బస్సులలో ప్రయాణిస్తూ నగలను అపహరిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ మహిళల నుంచి బంగారు గొలుసులను కొట్టేస్తున్న జ్యోతి, దివ్య, యాదమ్మ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 26 తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరిపై ఎల్‌బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 10 కేసులు, వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉన్నాయని వివరించారు. మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించారు.