అమ్మకు కడుపు'కోత!'

Cesarean Surgeries in Mahabubnagar Private Hospitals - Sakshi

బిడ్డ పుట్టాలంటే తప్పని సిజేరియన్‌

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అడ్డగోలుగా ఆపరేషన్లు

నార్మల్‌ కాన్పు కంటే సిజేరియన్‌ కేసులే అధికం

సాధారణ కాన్పులు చేసే అవకాశమున్నా ప్రోత్సహించని వైనం

దృష్టి పెట్టని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు

పాలమూరు: ప్రధానంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్‌ శస్త్ర చికిత్సల ద్వారానే కాన్పులు చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. కొంచెం నొప్పులొస్తుండగానే భయంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్న కుటుంబాల బలహీనతే ఆసరాగా వైద్యులు కడుపుకోత పెడుతున్నారు. సాధారణ కాన్పు సులువుగా అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కాసుల వేటలో మునిగి తేలుతున్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తును కించిత్తు దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి తల్లులకు అసలు ప్రసవ వేదనే తెలియకుండా పోతోంది. నవమాసాలు మోసిన తల్లి నొప్పులు భరించైనా తన బిడ్డకు పురుడు పోస్తుందనేది పెద్దల మాట. వైద్యులు ఆ అవకాశమే లేకుండా ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకు పురిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. వైద్యుల సలహా పాటించకుంటే ఏం ప్రమాదం పొంచి ఉందోనన్న భయం బాధిత కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. శస్త్రచికిత్స సమయంలో ఇచ్చే మత్తు మందు మున్ముందు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 

మూడొంతులు శస్త్రచికిత్సలే
జిల్లాలో 2019ఏప్రిల్‌నుంచి 2020ఫిబ్రవరి 29వరకు 15,608 మంది గర్భిణులువివిధ ఆస్పత్రుల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఈ కాన్పులు జరుగుతున్న తీరు.. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల వ్యాపార ధోరణి విమర్శలకు తావిస్తోంది. శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం ఇస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. రోజురోజుకూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్‌ కాన్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నవమాసాలు బిడ్డను ఆనందంతో మోసినా ప్రసవ సమయంలో కడుపుకోత మిగుల్చుతున్నారు. పురుడు అంటేనే పునర్జన్మ అంటారు. అలాంటిది కాన్పు అంటేనే ‘కోత’గా మారింది. శస్త్రచికిత్స కాన్పులతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకుని తాత్కాలికంగా మురిసిపోతున్నారు. అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారు. కొంత మేర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మా త్రం దాదాపు 80శాతానికి పైగా సిజేరియన్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక పోవడంతో వారు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. దీంతో గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు, సిజేరియన్లు చేస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు.

పట్టించుకోని ఆరోగ్య శాఖ
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇష్టారీతిన సిజేరియన్లు జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. జిల్లాలోని చాలా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాపారమే ధ్యేయంగా ప్రసూతి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రైవేట్‌లో కాసుల ప్రసూతి హవా సాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రైవేట్‌ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తే తల్లి, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆయా కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుంది. జిల్లాలో సిజేరియన్‌ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండటంతో ప్రజలకు ఆర్థికంగా భారమవుతోంది. పేదలకైతే మరీ నరకం, ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో కాన్పునకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతోంది. ఇలా జిల్లాలో ప్రైవేట్‌లో అయిన 4,989 ప్రసవాలకు ఒక్క కేసుకు రూ.30వేలు లెక్కించినా రూ.149కోట్ల ఆదాయం వస్తుంది. సర్కార్‌ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు పైగా వారే రూ.12వేలు చెల్లిచడంతో పాటు కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్నారు. వైద్య వర్గాల సమాచారం మేరకు నాలుగు సందర్భాల్లోనే సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సుఖ ప్రసవానికి కడుపులో బిడ్డ ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు, బిడ్డ బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలుంటేనే సిజేరియన్‌ చేయించాలి. దీనిపై సరైన అవగాహన లేని ప్రజలు సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు.  

ప్రసవ కోతలతో దీర్ఘకాలిక నష్టాలు
కడుపు కోత కారణంగా శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
మునుపటిలా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు.  
కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంతోనూ నొప్పులు వేధిస్తుంటాయి.
హెర్నియా వంటి దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.
రెండోకాన్పు తప్పకుండా సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది.
సిజేరియన్‌ జరిగే సమయంలో గర్భాశయం పక్క భాగాలపై గాయాలవడంతోపాటు ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి.
మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదముంటుంది.
రక్తస్రావంతో అదనపు రక్తాన్ని అందించాల్సిన పరిస్థితులు వస్తాయి.
రెండో కాన్పు సమయంలో తొమ్మిదో నెలలో గర్భసంచికి గతంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది.
గర్భసంచికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతక్కుపోయే అవకాశాలుంటాయి. తద్వారా భవిష్యత్‌లో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి వచ్చే అవకాశాలుంటాయి.
కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకా«శం ఉంది. దీనిని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు.
అత్యవసరంగా ఆపరేషన్‌ చేస్తే ఇబ్బంది ఉండదు కానీ, అవసరం లేకున్నా చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం.

కేసుల వారీగా సమీక్షిస్తాం
ఎక్కువ సిజేరియన్లు అవుతుంటే ఒక్కో కేసును సమీక్షించి ఎందుకు చేయాల్సి వచ్చిందో సిబ్బంది నుంచి వివరణ తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ వైద్యసేవలు బలోపేతమయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ నార్మల్‌ డెలవరీ అయ్యే పరిస్థితి ఉన్నా సిజేరియన్‌ చేస్తే అలాంటి వారు బాధితులు ఎవరు ఉన్నా ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సాధారణ ప్రసవాలపై నిబంధనలు వివరిస్తాం.
– డాక్టర్‌ కృష్ణ,జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి  

సాధారణ కాన్పుతో ఆరోగ్యం మెరుగు  
సాధారణ కాన్పు వల్ల ఆ మహిళకు ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశాలుండవు. పూర్తి ఆరోగ్యవంతురాలిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా శస్త్ర చికిత్సతోనే ప్రసవం చేయాల్సి ఉంటుంది. సిజేరియన్‌ వల్ల శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తుంటాయి. మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదముంటుంది. లీటరు రక్తం వరకు వృథాగా వెళ్తుంది దీంతో అదనపు రక్తాన్ని అందించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది.        – రాధ, గైనిక్‌ హెచ్‌ఓడీ, జనరల్‌ ఆస్పత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top