‘సీఈవో ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం’

The CEO invitation is rejected - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈనెల 25న ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ స్వయంగా అంగీకరించి క్షమాపణలు చెప్పారని, కానీ పార్లమెంటు ఎన్నికల నాటికి కూడా అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీంతో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని రజత్‌కుమార్‌ ఇచ్చిన ఆహ్వానాన్ని తాము తిరస్కరిస్తున్నామని ఆయన చెప్పారు.

బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు జి.నిరంజన్, బి.కమలాకర్, ఎం.ఆర్‌.జి.వినోద్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని, ధర్నాలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పట్ల తమ వైఖరిని స్పష్టంగా చెప్తామని ఆయన వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాగాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన మర్రి ఆమె రాకతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top