ఒక్కసారి అవకాశం ఇవ్వండి

Central Minister Amit Shah Meeting In Choutuppal - Sakshi

  ప్రజలకు కేసీఆర్‌ చేసిందేమీ లేదు  

  నేటికీ ఫ్లోరైడ్‌ నీటినే తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు

  నక్కలగండిని పూర్తి చేయడంలో టీఆర్‌ఎస్‌ విఫలం

  బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా

  తంగడిపల్లిలో ఎన్నికల బహిరంగ సభ 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్‌కు పలుమార్లు అవకాశం ఇచ్చారు.. కానీ, వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు.  బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ మండలం తంగడిపల్లిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ జిల్లా వాసులు నేటికీ ఫ్లోరైడ్‌ నీటినే తాగుతున్నారని.. ప్రజల కోసం ఏం చేశావో చెప్పాలి కేసీఆర్‌ అంటూ ప్రశ్నించారు. 

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం/చౌటుప్పల్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్‌లకు పలుమార్లు అవకాశం ఇచ్చినా వారు చేసిన అభివృద్ధి ఏమి లేదని బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.  మునుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ మండలం తంగడిపల్లిలోని ముసుకు మధుసూదన్‌రెడ్డి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘మార్పు కోసం బీజేపీ’ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి’’  నెలకొన్న పవిత్ర క్షేత్రంలో రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ నమస్కరిస్తున్నానన్నారు.   బీజేపీ నాయకుడు గుండగాని మైసయ్య గౌడ్‌ ఊరికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించానని తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్‌తో అనారోగ్యం పాలవుతున్న  ప్రజల కోసం కేసీఆర్‌  ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు.

చౌటుప్పల్‌లోని మందుల కంపెనీలతో లాలూచీ పడి ఆ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం పాడైపోతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్లతో నక్కలగండి ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.   నక్కలగండి ప్రాజెక్ట్‌ బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. నాలుగు సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్‌ స్థాపించ లేదని విమర్శించారు.  బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గంగడి మనోహర్‌రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి చౌటుప్పల్‌ను నేషనల్‌ రూర్బన్‌ పథకంలో చేర్చారన్నారు. మనోహర్‌రెడ్డి గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం  రాజస్థాన్‌ జలవనరుల సలహాదారు శ్రీరామ్‌ మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతోనే  కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కో సం టీఆర్‌ఎస్‌ ఓవైసీతో జట్టు కట్టిందని ఆరోపించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాసర్ల లింగయ్య మాట్లాడుతూ అవకాశం ఇస్తే సేవ చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని అన్నారు.

సమస్యలకు కారణం కాంగ్రెస్‌ పార్టీనే..
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని మునుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి విమర్శించారు.  ఫ్లోరోసిస్‌ నీళ్లకు, బీడు బీములకు, విద్యా, వైద్య సదుపాయాలు లేని నియోజవర్గానికి చిరునామాగా మునుగోడు మారిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ చండూరు సభలో చర్లగూడెం ప్రాజెక్ట్‌ను కుర్చి వేసుకుని పూర్తి చేస్తానని చెప్పి నిన్న అదే చండూరు సభలో వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చర్లగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుంచి తీసుకు వస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గట్టుప్పల్‌ మండలాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు.మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లలేని అసమర్థుడు అని విమర్శించారు.  2009 నుంచి ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి  మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో త నను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు  అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.   ఈ కార్యక్రమంలో బీదర్‌ ఎమ్మెల్సీ రఘునాథరావు, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, నల్లగొండ అభ్యర్థి శ్రీరా మోజు షణ్ముఖ, జిట్టా బాలకృష్ణారెడ్డి, దోనూరి వీరారెడ్డి, సాగర్ల లింగయ్య, కాయితి రమేష్, దూడల భిక్షం, దాసాజు వెంకటాచారి, బాస్కర్‌ నర్సింహ, గుజ్జల సురేందర్‌రెడ్డి, పాలకుర్ల జంగయ్య, తడక సురేఖ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తాలు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top