హస్తినకు రండి.. చర్చిద్దాం!

Central Hydropower Department Calls Telugu States For Meeting - Sakshi

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల శక్తి శాఖ పిలుపు

21న ఇరు రాష్ట్రాల అధికారులతో కీలక భేటీ ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై మరో దఫా చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల అధికారులతో కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల శక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆర్కే కనోడియా తెలంగాణ, ఏపీలతో పాటు కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశారు. రెండో బోర్డుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తామని తెలుపుతూ ఆరు ఎజెండా అంశాలను లేఖలో పొందుపరిచారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించడం, బోర్డుకు రాష్ట్రాల నిధుల విడుదల, కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, నీటి నిర్వహణ, బోర్డుల పరిధి, తదుపరి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది.

పెండింగ్‌ వివాదాల పరిష్కారమే లక్ష్యం.. 
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాద సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటికి బోర్డులు పరిష్కారం చూపలేకపోతున్నాయి. కృష్ణా బేసిన్‌ లోని ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో ఉండా లని బోర్డు పట్టుబడుతుండగా తెలంగాణ దాన్ని తిరస్కరిస్తోంది. కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ట్రిబ్యునల్‌ పరిశీలనలో ఉన్నప్పుడు, బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదని అంటోంది. జలాల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడటం కోసం ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేర కు కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఈ రెండు బోర్డుల పనితీరును పర్యవేక్షిం చడానికి అపెక్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చైర్మన్‌గా వ్యవహరించే అపెక్స్‌ కౌన్సిల్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సభ్యులు. కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి ఐదేళ్లకు పైగా కావస్తున్నా ఇప్పటికీ వాటి పరిధి.. వర్కింగ్‌ మాన్యువల్‌ను కేంద్రం ఖరారు చేయలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీపై ఈ సమావేశంలో స్పష్టత తీసుకోనుంది. ఆర్డీఎస్‌ పథకం కింద తెలంగాణ కు 15.9 టీఎంసీల కేటాయింపులు న్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదని పునరుద్ధరణ పనులకు ఏపీ సహకారం అందించాలని కోరుతోంది.

1978 గోదా వరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ అంటోంది. 80 టీఎంసీల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలోనే ఉందని, ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే అని చెబుతోంది. బచావత్‌ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా మరేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని, ప్రస్తుతం ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కానందున దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని, బోర్డులను కోరింది. కేంద్రమే దీనికి పరిష్కారం చూపాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top