అంతా బోగస్‌

Central Government Economic Package Is A Bogus Says CM KCR - Sakshi

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌

కేంద్రం ఇచ్చేది రూపాయి లేదు

రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా భావించింది

ఇదేనా సంస్కరణలు అమలుచేసే పద్ధతి?

ఒకటి చేస్తే ఒకటి ఇస్తామనడం ఏమిటి?

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయం

రాష్ట్రాలపై పెత్తనం సమాఖ్య విధానానికే విఘాతం

సాక్షి, హైదరాబాద్‌: ‘కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల. వంద శాతం బోగస్‌. ఇది నేను చెప్తలేను. ఇం దులో కేంద్రం పెట్టేది రూ.లక్ష కోట్లు కూడా లేదు. అంతా గాలి అని సింగపూర్‌ నుంచి వచ్చే ‘ఏసియన్‌ ఇన్‌సైట్‌’అనే మేగజీన్‌ రాసింది. అంకెల గారడీనా? లేక నిజంగా జీడీపీ పునరుత్థానమా? అని కేంద్ర ఆర్థిక మంత్రిని జపాన్‌ నుంచి వచ్చే అంతర్జాతీయ జర్నల్‌ బెర్నిస్ట్‌ ప్రశ్నించింది. మేము కోరింది ఇది కాదు.

దారుణాతి దారుణమైన విషయమేమిటంటే ఘోర విపత్తు సంభవించి, కరోనా వంటి వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి దేశాలు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతికి నగదు రావాలని కోరినం. అది వస్తే అనేక రూపాల్లో ప్రజల్లో పంపిణీకి పోతుంది. మేము ఇది కోరితే రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా కేంద్రం భావించింది’అని సీఎం కేసీఆర్‌ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కరోనా దెబ్బతో కుదేలైన దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేం దుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ బోగస్‌ అని మండిపడ్డారు. సోమవారం ప్రగతి భవన్‌లో కేబినెట్‌ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

షరతులు వింటే నవ్వుతారు..
‘ఇదేనా దేశంలో సంస్కరణలు అమలు చేసే పద్ధతి? రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచిన్రు. అంటే తెలంగాణకు రూ.20వేల కోట్ల అప్పులు అదనంగా వస్తాయి. అందులో పెట్టిన షరతులు వింటే ఎవరైనా నవ్వుతరు? ఇందులో కేంద్రం రూపాయి నోటు లేదు. కేవలం రుణ పరిమితి పెంచడమే. అది మళ్లీ రాష్ట్రమే కట్టుకోవాలి. కేంద్రం చిల్లి గవ్వకూడా ఇవ్వదు. రూ.5వేల కోట్లు ఇస్తరట.

తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి 3.5% ఆల్రెడీ ఉంది. ఆ రూ.5వేల కోట్లు కొత్తగా ఏమీ రావు. కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. మిగిలిన ప్రతి రూ.2,500 కోట్లకు ఒక సంస్కరణను ఆంక్షగా పెట్టారు. విద్యుత్‌ సంస్కరణలను తెచ్చి ప్రజల మెడ మీద కత్తి పెడితే రూ.2,500 కోట్లు ఇస్తరట. ఇది ప్యాకేజీనా? దీనిని ప్యాకేజీ అనరు. ఇది సమాఖ్య వ్యవస్థలో అనుసరించాల్సిన విధానం కాదు. ఈ విపత్కర పరిస్థితులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఇలా వ్యవహరించవచ్చునా? ఎంత దుర్మార్గమండి? మార్కెట్‌ కమిటీల్లో కేంద్రం చెప్పిన సంస్కరణలు తెస్తే ఇంకా రూ.2,500 కోట్లు ఇస్తరట.

ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? మునిసి పాలిటీల్లో పన్నులు పెంచి ప్రజలపై భారం వేసి ఆదాయం పెంచే సంస్కరణలు తెస్తే ఇంకో రూ.2,500 కోట్లు ఇస్తరట. దీన్ని ప్యాకేజీ అంటరా? దీన్ని ఏం అనాలి? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో లింక్‌ పెట్టారు. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు అని పెట్రిన్రు.. ఈజ్‌ ఆఫ్‌ డుయింగ్‌ బిజినెస్‌ సంస్కరణలు అన్నరు. వీటిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. ఈ నాలుగు సంస్కరణల్లో మూడింటిని అమలు చేస్తే ఇంకో రూ.5వేల కోట్లు ఇస్తరట. ఇదేం బేరమండి? ఇది పచ్చి మోసం. దగా. అంకెల గారడీ. అంతా గ్యాస్‌. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకుంది. నిజం ప్యాకేజీ ఎలా ఉంటది.. బోగస్‌ ఎలా ఉంటదో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నేను చాలా బాధపడుతున్న’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

సమాఖ్య విధానం ఎక్కడ?
రాష్ట్రాలపై కేంద్రం ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం సమాఖ్య విధానానికే విఘాతమని కేసీఆర్‌ విమర్శించారు. ‘కోపరేటివ్‌ ఫెడరలిజం అని ప్రధానమంత్రి అన్నరు. అది వట్టి బోగస్‌ అని ఈ రోజు తేలిపోయింది. సమాఖ్య విధానం ఎక్కడుంది? ఈ విపత్కర సమయంలో మీరిది చేస్తే పైసలిస్తం అంటున్నరు. ఇదేమైనా పిల్లల కొట్లాటనా? ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదు. మెడ మీద కత్తి పెట్టి కరెంట్‌ సంస్కరణలు చేయి రూ.2,500 కోట్ల బిచ్చం వేస్తం. మునిసిపల్‌ ట్యాక్సులు పెంచు..రూ.2500 కోట్ల బిచ్చం ఇస్తాం అనడం ప్యాకేజీగా పరిగణిస్తరా? తెలంగాణ పురోగతమిస్తున్న రాష్ట్రం.

వారు పెట్టిన షరతుల్లో ఇప్పటికే మూడింటిని సాటిస్‌ఫై చేసింది. కేంద్రం ప్యాకేజీ పెట్టిన విధానం బాగాలేదు. రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయం. అవసరమైతే ఆ ముష్టి రెండున్నర వేల కోట్లు తీసుకోం. మిగిలిన సంస్కరణలు ఇంకా దారుణంగా ఉన్నయి. అవి చేస్తే పూర్తిగా అన్ని ప్రైవేటీకరించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలుగా కూడా రాజ్యంగబద్ధమైనవి. అవి సబార్డినేట్స్‌ కాదు. కేంద్రం కన్నా రాష్ట్రాల మీద అధిక బాధ్యతలు, విధులు ఉంటాయి’అని సీఎం పేర్కొన్నారు. కేంద్రం వైఖరిపై ఇతర రాష్ట్రాలను కలుపుకొని పోరాడతారా అని ప్రశ్నించగా.. ‘శిశుపాలుడిని వంద తప్పులు మన్నించిన్రు కదా? పాపం పండాలి కదా’అని బదులిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top