అన్యోన్యంగా జీవిస్తున్న దంపతుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. ఓ ఇల్లాలి నిండు జీవితాన్ని బలితీసుకుంది
♦ ఫోన్‌కాల్స్‌పై భార్యాభర్తల మధ్య ఘర్షణ
♦ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య
♦ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
♦ తాటిపల్లిలో ఘటన
మునిపల్లి : అన్యోన్యంగా జీవిస్తున్న దంపతుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. ఓ ఇల్లాలి నిండు జీవితాన్ని బలితీసుకుంది. మునిపల్లి మండలం తాటిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గొల్ల జగన్, శోభారాణి(24) నిరుపేద దంపతులు. జగన్ సదాశిపేటలోని ఎంఆర్‌ఎఫ్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శోభారాణి పిల్లలను చూసుకుంటే ఇంటి వద్దే ఉంటుంది. సదాశివపేటలోని గురునగర్ కాలనీలో చాలా ఏళ్లపాటు నివాసం ఉన్న వీరు ఆరు నెలల క్రితం స్వగ్రామమైన తాటిపల్లికి వచ్చి ఇక్కడే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో గురువారం కూరగాయలు కొనేందుకు సంతకు వెళ్లిన శోభారాణి సాయంత్రానికి ఇంటికి వచ్చింది. అక్కడే ఉన్న భర్త సెల్‌ఫోన్‌ను పరిశీలించగా గుర్తుతెలియని ఫోన్ నంబర్లు కనిపించాయి. ఈ విషయమై భర్త జగన్‌ను నిలదీయగా అతను సమాదానం చెప్పకుండా వాటిని డిలిట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
తీవ్ర మనస్థాపానికి గురైన శోభారాణి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. గమనించిన ఇరుగుపొరుగు వారు 108 అంబులెన్‌సలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుదేరా ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. కాగా మృతురాలికి కొడుకు, కుమార్తె ఉంది.