బ్యాంకులో డబ్బుల మాయంపై సీబీఐ విచారణ

cbi enquiry on bank money disappear - Sakshi

11 ఏళ్లుగా పనిచేసిన మేనేజర్లు, సిబ్బందిపై కేసు 

సూత్రదారులు, పాత్రదారులెవరనేదానిపై ఆరా

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డబ్బులు మాయమైన కేసు సీబీఐ చేతికి చేరింది. గత నెల 30న బయటకు వచ్చిన ఈ కుంభకోణం సంచలనం సృష్టించింది. దీనిపై సీబీఐ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. డిపాజిట్‌ దారుల ఖాతాల్లో నుంచి బ్యాంకు అధికారులే డబ్బులు స్వాహా చేసినట్లు తేల్చారు. గత 11 సంవత్సరాలుగా బ్యాంకులో పనిచేసిన పలువురు మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది కలిసి మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రూ.9 కోట్ల వరకు దోపిడీ చేసినట్లు తేల్చారు.

10 మందిపై కేసు నమోదు...
తెలంగాణ గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ అధికారులు పది మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుత బ్యాంకు మేనేజర్‌ మండల రవీందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ అధికారులు ప్రధాన నిందితుడు క్యాషియర్‌ మాడి జైపాల్‌రెడ్డితోపాటు ఇక్కడ గతంలో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన జే.మోజస్, కె.లక్ష్మినర్సయ్య, కె.చంద్రయ్య, జి.శ్రీనివాసరావు, రాజన్న, వీవీజే రామారావు, ప్రస్తుత అకౌంటెంట్‌ సి.గురుప్రసాద్, తాత్కాలిక ప్రాతిపధికన స్వీపర్‌గా పనిచేస్తున్న మాడి శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరితోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంత మంది ప్రైవేటు వ్యక్తులపై సైతం కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం, బుధవారం సీబీఐ అధికారులు బ్యాంకును సందర్శించి పలు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వేర్వేరుగా విచారించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రధాన సూత్రదారి క్యాషియర్‌...
అజీజ్‌నగర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో బ్యాంకు క్యాషియర్‌ జైపాల్‌రెడ్డి ప్రధాన సూత్రదారి అని తేలింది. 2010 నుంచి 2018 జనవరి వరకు బ్యాంకు క్యాషియర్‌గా జైపాల్‌రెడ్డి పనిచేశాడు. అయితే మొదట్లో ఖాతాదారులు బ్యాంకులో డబ్బులు జమచేస్తే వారికి సరైన రశీదు ఇచ్చేవాడు. కానీ డబ్బులు మాత్రం ఖాతాలో వేయకుండా తన అవసరాలకు వాడుకునే వాడు. ఇలా మొదలైన ఈ వ్యవహారం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనూ మొదలు పెట్టాడు. బ్యాంకులో డిపాజిట్‌ చేసిన కోట్ల రూపాయలకు నకిలీ రశీదులు, బాండ్లు ఇచ్చేవాడు. డిపాజిట్‌దారులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వస్తే తానే ఇచ్చావేడు. ఇలా ఖాతాదారుల సొమ్మును అడ్డగోలుగా తన అవసరాలకు వాడుకునేవాడు. ఈ వ్యవహారానికి బ్యాంకు మేనేజర్, ఇతర సిబ్బంది సహకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top