‘ట్రాన్స్‌ట్రాయ్‌’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ

CBI Deeply Investigation On Rayapati Sambasiva Rao Bank Cheating Case - Sakshi

సంస్థ మొత్తం అప్పులు రూ.8,830 కోట్లు

ఒక్క కెనరా బ్యాంకు ఇచ్చిన రుణం రూ. 990 కోట్లు

గతేడాది ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన కెనరాబ్యాంకు

దేవుళ్లకు కోట్ల విలువైన కానుకలిచ్చిన ఎండీ చెరుకూరి శ్రీధర్‌

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్టర్, ప్రమోటర్‌ చైర్మన్‌గా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ రుణాల ఎగవేత కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కంపెనీకి రుణాల జాబితా పెద్దమొత్తంలోనే ఉంది. తాజాగా రూ. 264 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతపై సోమవారం సీబీఐ కేసు నమోదు చేసిన దరిమిలా..కంపెనీకి చెందిన పలు ఆర్థిక లావాదేవీలు వెలుగుచూస్తున్నాయి. 2013లో భారీగా రుణాలు పొందిన ట్రాన్స్‌టాయ్‌ తరువాతకాలంలో వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో ప్రస్తుత బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి.

14 జాతీయ బ్యాంకుల వద్ద..: తాము పలు ఇరిగేషన్, రోడ్లు, మెట్రో, మెట్రో అండ్‌ రైల్వేస్, ఆయిల్‌ గ్యాస్‌ల ప్రాజెక్టులు చేపడతామని ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ చెబుతోంది. వాస్తవానికి ఇంతవరకూ ఈ కంపెనీ కేవలం రోడ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులను విజయవంతంగానే పూర్తి చేసింది. మిగిలిన రంగాల్లో ఇంతవరకూ ఎలాంటి పనులు చేపట్టలేకపోయింది. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో కుమరంభీమ్‌ ప్రాజెక్టు, అనంతపురంలోని చాగల్లు బ్యారేజ్‌లను పూర్తి చేసింది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌రోడ్‌ ఫేస్‌–1 పనులను, మధ్యప్రదేశ్‌లో రెండు భారీ, తమిళనాడులో ఓ భారీ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసింది. 2013 ప్రారంభంలో ట్రాన్స్‌ట్రాయ్‌ తాను దక్కించుకున్న రూ.4,717 కోట్ల విలువైన పోలవరం హెడ్‌ రెగ్యులేటరీ వర్క్స్‌ పనులతోపాటు, ఇతర అభివృద్ధి పనులు చూపి 14 బ్యాంకుల కన్సార్షియం వద్ద వివిధ దశల్లో రూ.8,800 వరకు రుణాలు పొందింది.

ఈ 14 జాతీయ బ్యాంకుల్లో రూ.990 కోట్లు వరకు అప్పిచ్చిన కెనరా బ్యాంకు లీడ్‌ బ్యాంకుగా ఉంది. తమ నుంచి నిధులను రుణాలుగా పొందినా తిరిగి చెల్లించడంలో ట్రాన్స్‌టాయ్‌ జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ 2015 నుంచే బ్యాంకుల కన్సార్షియం రుణాల రికవరీకి ప్రయత్నాలు ప్రారంభించాయి. అదే మే నెలలో ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ ఖాతాను ఎన్‌పీఏ (నిరర్ధకఖాతా)గా ప్రకటించాయి. ఇక 018 లోనే నేషనల్‌ కంపనీస్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను కెనరాబ్యాంకు ఆశ్రయించింది. తాజా గా తమ నుంచి తీసుకున్న రుణాల్లో రూ.264 కోట్లను వేరే ఖాతాలకు మళ్లించారన్న యూనియన్‌బ్యాంకు ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా.. 
ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ పలుమార్లు తానిచ్చిన విరాళాలతో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2012 నవంబరు 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు చీరను కానుకగా సమర్పించారు. అప్పట్లో ఇది బాగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2013 డిసెంబరు 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు 3.42 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top