పాత సిలబసే..! | Sakshi
Sakshi News home page

పాత సిలబసే..!

Published Thu, Aug 9 2018 1:24 PM

CBCS System In Kakatiya University Karimnagar - Sakshi

రాష్ట్రంలో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌)కు అనుగుణంగా డిగ్రీలో సిలబస్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి వాయిదా వేసుకుంది. ఇటీవల మండలి చైర్మన్, ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్‌ల సమావేశంలో సిలబస్‌పై ఒక నిర్ణయానికి వచ్చారు. డిగ్రీ సిలబస్, సీబీసీఎస్‌ క్రెడిట్స్‌ విధానంలో మార్పులపై చర్చించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వచ్చే విద్యాసంవత్సరం (2019–2020)  డిగ్రీ సిలబస్‌ను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తుందనే ఉద్దేశంతో పాత సెలబస్‌నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫలితంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు కూడా పాతసిలబస్‌నే అనుçసరించి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. 

శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్‌): డిగ్రీ తరగతులు ప్రారంభమైన మొదట్లో సెలబస్‌ మారుతుందని మల్లాగుల్లాలు పడిన అధాపకులు.. పాత సిలబస్‌లోని ప్రాథమిక అంశాలను మాత్రమే బోధిస్తూ కొద్ది రోజులు కాలంగడిపా రు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో పాత సిలబస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. పాఠ్యాంశాల బోధనలో వేగం పెంచారు. డిగ్రీ కోర్సుల్లో చాయిస్‌ బేస్ట్‌ క్రెడిట్‌ సిస్టం అమలులోకి వచ్చాక ఆరునెలల్లో ఒక సెమిస్టర్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిగ్రీ తరగతులు జూలైలో ప్రారంభం కాగా జనవరిలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

మొదట్లో సెలబస్‌పై స్పష్టత లేక దాదాపు పదిహేను, ఇరవై రోజులు గత సెలబస్‌లోని ప్రాథమికాంశాలు మెల్లిమెల్లిగా బోధిస్తూ వచ్చారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు కూడా సిలబస్‌ ఇదేనో..? కాదో..? అనుకుని తరగతులపై పెద్దగా దృష్టిసారించలేదు. మారుతుందనే ఆలోచనతో ఇటూ అధ్యాపకులూ మనసు పెట్టకుండా సమయం వృథా చేశారు. తీరా ఉన్నత విద్యామండలి పాత సెలబస్‌నే అనుసరించాలనే నిర్ణయానికి రావడంతో సెలబస్, పాఠ్యాంశాలపై స్పష్టత ఏర్పడింది. దీనితో వివిధ కళాశాలల్లో  సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో వేగం పెంచినట్లు సమాచారం.

 నాలుగు నెలల్లోనే బోధన...!
డిగ్రీలో సెమిస్టర్‌ విధానం అమలైన నాటినుండి దాదా పు ఇంటర్నల్స్, సెమిస్టర్‌ పరీక్షలు అన్ని లెక్కకడితే రెం డు నెలల సమయం పరీక్షలు రాయడానికే కేటాయించాల్సి వస్తుంది. దీంతో నాలుగు నెలల్లోనే అనుకున్న సిలబస్‌ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 20రోజుల పైగానే సిలబస్‌పై స్పష్టత లేకుండానే బోధన సాగింది. అంటే మెజారిటీ సెలబస్‌ దాదాపుగా 90 నుంచి 100 రోజుల్లోనే పూర్తిచేయాల్సి ఉంటుంది.

సిలబస్‌ మారుతుందనే ఉద్దేశంతో మెల్లిగా బోధిస్తూ వచ్చిన అద్యాపకులు.. ఇప్పుడు మిగిలిన రోజులకు పాఠ్యప్రణాళిక రూపొందించుకుని వేగంగా లక్ష్యాన్ని గడువులోపు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంత చేసినా కొన్ని కళాశాలల్లో సెమిస్టర్‌ ఆఖరులో కొన్నిసబ్జెక్టులకు ప్రత్యేకంగా అదనపు తరగతులు, సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతూనే ఉంది. సిలబస్‌ ప్రకారం కొన్ని కోర్సుల సెలబస్‌ ఇచ్చిన గడువులో పూర్తవుతుంది కానీ మరికొన్ని సబ్జెక్టులు ఇందులో ముఖ్యంగా ఒకటి, రెండు కంప్యూటర్స్‌కు సంబంధించిన సెలబస్‌కు ఆరు నెలల సమయం సరిపోదని విద్యావేత్తలు భావిస్తున్నారు.

ప్రవేశాలిలా...
శాతవాహన యూనివర్సిటీలో మొత్తం బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో కలుపుకుని 45,471 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈ విద్యాసంవత్సరానికి 20,350 సీట్లు భర్తీ కాగా 44.75 శాతం నమోదైంది. 25,121 సీట్లు ఖాళీగానే మిగిలాయి. ఇందులో ఎక్కువ శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియం వైపు మొగ్గుచూపినట్లు ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.యూనివర్సిటీ పరిధిలో 81 శాతం ఇంగ్లిష్‌ మీడియం సీట్లుండగా దాదాపుగా 19 శాతం వరకు తెలుగు మీడియంలో సీట్లున్నాయి. కానీ 49 శాతం ఇంగ్లిష్‌ మీడియం సీట్లు భర్తీకాగా.. కేవలం 27 శాతమే తెలుగు మీడియం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్‌లో ఇంగ్లిష్‌మీడియం చదువుకున్న వారితో పాటు చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు కూడా డిగ్రీలో ఇంగ్లిష్‌ మీడియంను ఎంచుకున్నారు.

కానీ తరగతి గదిలో బోధనను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంటర్‌ నుండి డిగ్రీలోనే మీడియం మార్పు చేసుకున్నారు కాబట్టి తరగతి గదిలో తెలుగులో, ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు బోధించాలని అధ్యాపకులను యాజమాన్యాలు సూచిస్తున్నాయి. కష్టమైనా సరే ఇంగ్లిష్‌మీడియంలోనే చదువాలని విద్యార్థులు నిర్ణయించుకుంటున్నారని అర్థమవుతోంది. రానున్న రోజుల్లో తెలుగు మీడియం చదివే అభ్యర్థులు కరవువుతారనే భావన విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. డిగ్రీ సెలబస్‌ మార్పు అంశంపై వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం.కోమల్‌రెడ్డిని సంప్రదించగా.. పాత సెలబస్‌నే అనుసరించాలని సూచించారు.

Advertisement
Advertisement