ఓటేయలేదని కుల బహిష్కరణ

Caste relegation for not voting - Sakshi

తప్పు ఒప్పుకుని.. కాళ్లు మొక్కాలని హుకుం 

ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడొద్దని తీర్మానం 

మాట్లాడిన వారినీ కులం నుండి బహిష్కరిస్తామని హెచ్చరిక 

ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన 

‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్న బాధిత కుటుంబం 

గొల్లపల్లి (ధర్మపురి): తనకు ఓటేయలేదని పంచాయితీ పెట్టించి.. చివరకు ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించిన సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం ప్రకారం.. లొత్తునూర్‌ గ్రామం ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. మూడో విడత నిర్వహించిన ఎన్నికల్లో ఆ గ్రామం నుంచి ఏడుగురు బరిలో నిలిచారు. వీరిలో ఇద్దరు ఎస్సీ మాదిగవర్గానికి చెందినవారు కాగా.. మరో ఐదుగురు మాలవర్గానికి చెందినవారు. ఈ ఎన్నికల్లో మాల కులానికి చెందిన మహేశ్వరి విజయం సాధించింది. గ్రామానికి చెందిన దొనకొండ తిరుపతి (మాదిగ) కుటుంబం తనకు ఓటేయలేదని ఓడిపోయిన అభ్యర్థి ఓరుగంటి శాంత (మాదిగ) కక్ష పెంచుకుంది.

తమ కులాన్ని కాదని.. ఇతర కులానికి చెందిన వ్యక్తికి ఓటేశారని ఆమె భర్త పోశయ్య.. తిరుపతిని వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఈనెల 4న కులసంఘంలో పంచాయితీ పెట్టించాడు. అందులో సంఘంలో తిరుపతి పొదుపు చేసుకున్న రూ.3 వేలు తిరిగి ఇచ్చి తెగదెంపులు చేయించాడు. కులంతోపాటు.. కులసంఘంతోనూ సంబంధంలేదని, ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడొద్దంటూ సంఘం నుంచి బహిష్కరించారు. చేసిన తప్పు ఒప్పుకుని కులంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. కాళ్లు మొక్కి క్షమాపణ అడిగితేనే తిరిగి చేర్చుకుంటామని హెచ్చరించారు. ఐదు రోజులుగా తిరుపతి కుటుంబంతో ఎవరూ మాట్లాడకపోవడంతో అతడి భార్య లక్ష్మీ, కుమారుడు రాజమల్లు, కూతురు అఖిల కుమిలిపోతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించాలో తెలియక సతమతమవుతున్నాడు.  

అడ్డు చెప్పని పంచాయతీ పెద్దలు 
గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 150 కుటుంబాలు ఉన్నాయి. ఓటు వేయనందుకు తన కుటుంబాన్ని వెలి వేయడమేమిటని ప్రశ్నించిన తిరుపతికి అండగా నిలవాల్సిన కులపెద్దలెవరూ పట్టించుకోలేదు. పైగా పంచాయితీ పెట్టించిన శాంత భర్త పోశయ్యకే మద్దతు పలకడంపై తిరుపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఓటు నచ్చిన వ్యక్తికి వేసుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ.. బెదిరించి మరీ.. తనకు ఓటు వేయలేదంటూ పంచాయితీ పెట్టించి తన పరువు తీసిన శాంత భర్త పోశయ్యపై చర్యలు తీసుకోవాలని తిరుపతి వేడుకుంటున్నాడు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top