
సిద్దిపేట జిల్లా.. క్యాష్‌లెస్..
సిద్దిపేట నియోజక వర్గం తర్వాత సిద్దిపేట జిల్లాను కూడా నగదురహిత లావాదేవీల జిల్లాగా మార్చ నున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
- అధికార యంత్రాంగం సిద్ధం కావాలి: సీఎం కేసీఆర్
- నియోజకవర్గంలో ‘క్యాష్‌లెస్ విధానం’పై పాఠాలు నేర్వాలి
- మున్ముందు బ్యాంకుల పాత్ర గణనీయంగా పెరుగుతుంది
- సంస్థాగతంగా బలోపేతం కావాలి.. పనితీరు మెరుగుపడాలి
- సిద్దిపేటలో ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డులు జారీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట నియోజక వర్గం తర్వాత సిద్దిపేట జిల్లాను కూడా నగదురహిత లావాదేవీల జిల్లాగా మార్చ నున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. నగదురహిత లావాదేవీల నియోజక వర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దే క్రమంలో అనుభవ పాఠాలు నేర్చుకోవాలని, వాటిద్వారా రాష్ట్రవ్యాప్తంగా తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపాలని బ్యాంకర్లకు సూచించారు. సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజక వర్గంగా తీర్చిదిద్దే అంశంపై మంగళవా రం ప్రగతిభవన్లో బ్యాంకర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల కృషిని అభినందించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలతో బ్యాంకుల పాత్ర పెరుగుతుందని, అందుకు తగ్గట్లు బ్యాంకులు సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ కోసం బ్యాంకుల పనితీరు మెరుగుపడాలని సూచించారు. ‘‘తగిన న్ని స్వైపింగ్ యంత్రాలు అందుబాటు లోకి తేవాలి.
సిద్దిపేటలో 4 వేలకు పైగా స్వైపింగ్ యాంత్రాలను సమకూర్చాలి. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి డెబిట్ కార్డులు జారీ చేయాలి. కార్డుల ద్వారానే కాక మొబైల్ యాప్‌ల ద్వారా కూడా లావాదేవీలను ప్రోత్సహించాలి. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కార్డుల వినియోగంపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి. మొబైల్ యాప్‌ల ద్వారా లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులను భాగస్వామ్యం చేసుకోవాలి. ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం కొనసాగాలి. ఇందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో స్వైప్ మిషన్లు పెట్టాలి. చార్జీలు చెల్లించడానికి మొబైల్ యాప్స్‌ను వినియోగించేలా చూడాలి. వ్యాపారులందరికీ ఖాతాలు తెరవాలి’’ అని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు టి.హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.