దోస్త్‌ మేరా దోస్త్‌...

Captain Karunakar Reddy To Join Congress Party  In Bodhan - Sakshi

ఒకే గూటికి ప్రత్యర్థి నేతల త్రయం

‘చెయ్యి’ కలిపిన ఆ ముగ్గురు ఉద్దండ నేతలు

నాటి ప్రత్యర్థులు నేడు ఒకటే పార్టీలో..

ఆసక్తికరంగా బోధన్‌ రాజకీయాలు 

బోధన్‌(నిజామాబాద్‌ ): నిన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యే స్థానానికి  వేర్వేరు పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీ చేసిన ఆ ముగ్గురు ఉద్దండ నేతలు రాజకీయ ప్రత్యర్థులు. తాజా రాజకీయాల నేపథ్యంలో  చేయి చేయి కలిపారు. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఓకే గూటికి చేరుకున్నారు.గత ఎన్నికల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ తాజా రాజకీయ పరిధుతులు ఆ ముగ్గురు నేతలను ఏకం చేశాయి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నామినేషన్ల గడియలు సమీపిస్తున్న నేపథ్యంలో బోధన్‌ నియోజక వర్గంలో తాజాగా  చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా, రసవత్తరంగా మారాయి. ఆ ముగ్గురు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సిత్రాలను  ఓటర్లు  ఆసక్తిగా  గమనిస్తూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు గతాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు స్పష్టమవుతాయి. నవీపేట మండలంలోని సిరాన్‌పల్లి గ్రామానికి చెందిన పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి 1986–07లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి అప్పట్లో టీడీపీ అభ్యర్థి స్వర్గీయ కొత్త రమాకాంత్‌ చేతిలో ఓటమి చెందారు.1999,2004,2009 వరకు మూడు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికలబరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం పొంది హ్యాట్రిక్‌ రికార్డు సాధించారు.ఉమ్మడిరాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రి గా పని చేశారు.

2004. 2009లో తెలంగాణజనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి, 2014ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మేడపాటి ప్రకాష్‌ రెడ్డిలు మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి పై  పోటీ చేసి ఓడిపోయారు. కాని 25 వేలపైగా ఓట్లు సాధించి సత్తాచాటుకున్నారు.ఈ  ఇరువురు నేతలు గత ఎన్నికల్లో సుదర్శన్‌ రెడ్డికి ప్రత్యర్థి అభ్యర్థులే. అయితే ఇందులో మేడపాటి ప్రకాష్‌ రెడ్డి ఈ ఏడాది అక్టోబర్‌ 20న కామారెడ్డిలో జరిగిన  కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధినేత రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మరో నేత కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి విద్యార్ధి దశ నుంచి రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్‌ పార్టీ నుంచి మొదలైంది.

కాని  కాల క్రమంలో ఆయన పలు పార్టీల్లోకి వెళ్లారు.తాజాగా బిజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం వెల్లడించారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సాక్షితో తెలిపారు. కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి 2004,2009 ఎన్నికల్లో  వేర్వేరు పార్టీల అభ్యర్థిగామాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పై పోటీపడ్డారు. 2009 ఎన్నికల్లో  కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి 35 వేలపైగా ఓట్లు సాధించి సత్తా చాటుకున్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్థి నేతలను ఈ సారి ఎన్నికల్లో ఒకే పార్టీ వేదిక పై చూడబోతున్నాం. ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తి రేక్కెత్తిసున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top