పంతులూ ఓసారి ఇటు చూడు

Candidates Are Taking The Suggestions Of Priests For Filing The Nominations - Sakshi

నామినేషన్‌ వేసేందుకు పండితుల సలహా తీసుకుంటున్న అభ్యర్థులు

నెన్నెల(బెల్లంపల్లి): ఎన్నికల నగారా మోగింది. అందరూ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు పార్టీలు ప్రక టించిన అభ్యర్థులతోపాటు పోటీ చేయాలనుకుంటున్న వారు సీటు ఎటుతేలని నాయకులు కూడా పంచాంగం పండితుల సలహా తీసుకుంటున్నారు. ఈ మాసంలో 14వ తేదీ దివ్యమైనదిగా పండితులు చెబుతుండటంతో ఈ రోజు నామినేషన్లకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక 17, 19 తేదీల్లో మంచి రోజులేనని చెబుతున్న పంచాంగ పండితులు ఆయా అభ్యర్థుల నక్షత్రం, బలాన్ని బట్టి ఆ రోజు వారికి మంచిదా, కాదా అని చెబుతున్నారు. మొత్తంగా నామినేషన్లు వేసేందుకు గడువు బాగానే ఉన్నా మంచి ముహూర్తాలు లేవని అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మహాకూటమి ఇంకా తేలకపోవడంతో చివరి నిమిషంలో ఖరారు చేస్తే ఎలా నామినేషన్లు వేయాలని ఆందోళన చెందుతున్నారు. 
 

పండితుల సూచనలు
ఈ నెల 14న కార్తీక శుద్ధ సప్తమి శ్రవణ నక్షత్ర నేపథ్యంలో నామినేషన్లకు చాలా విశేషమైందని పండితులు చెబుతున్నారు. ఉదయం 10.42 నిమిషాల నుంచి 11.42 నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు మంచి ముహూర్తం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 17న కార్తీక శుద్ధ దశమి ఉంది. ఈ రోజు కూడా మంచి గడియలే ఉన్నాయని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చని చెబుతున్నారు. ఈ నెల 19న ముహూర్తం బాగానే ఉన్నా ఆయా అభ్యర్థుల నక్షత్రాలు, బలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. మొత్తంగా ఈ మూడు రోజులు మాత్రమే మంచి గడియలు ఉన్నాయి. 
 

ఈ తేదీలను ఎందుకు చెప్పడం లేదంటే..
13న మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపలేదు. 15న గురువారం అష్టమి ఉండటంతో నామినేషన్లు కష్టమే. ఈ నెల 16న నవమి తర్వాత దశమి వస్తున్న నేపథ్యంలో చాలా మంది నామినేషన్‌ వేయడం వద్దనుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. ఈ నెల 17వ శనివారం కావడంతో చాలా మంది నామినేషన్లు వేయడానికి ఆసక్తి చూపరు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top