ప్రజల ఆశీస్సులతోనే మంత్రినయ్యా..

Cabinet Ministers Telangana State 2019 - Sakshi

సాక్షి, జనగామ: ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా.

ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించడానికి తప్ప ఏ విషయాన్నీ ప్రత్యక్షం గానీ, పరోక్షం గానీ వ్యక్తులకు గానీ సంస్థలకు తెలియపర్చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అంటూ రాష్ట్ర మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌  నరసింహన్‌ ఎర్రబెల్లి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా మంత్రిగా నియమితులైన దయాకర్‌రావు తన కుటుంబసభ్యుల సమేతంగా తరలివెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు.

యాదాద్రిలో పూజలు.. తల్లిదండ్రుల స్మరణ..
రాష్ట్ర మంత్రిగా నియమితులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు  తమ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసమేతంగా లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వరుస క్రమంలో ఆరోమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లి తన తల్లిదండ్రులైన ఆదిలక్ష్మి, జగన్నాథరావు చిత్రపటాలకు పూలమాలు వేసి స్మరించుకున్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ కేటాయింపు..
ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలను కేటాయించారు. 2018లో కొత్తగా పంచాయతీ రాజ్‌ చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల అభివృద్ధిని కీలకంగా భావిస్తున్న శాఖను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన దయాకర్‌రావుకు కేటాయించడం విశేషం.
 
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్‌ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, డీఎస్‌ రెడ్యానాయక్, శంకర్‌నా యక్‌తోపాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లాతోపాటు వరంగల్,భూపాలపల్లి, వ రంగల్‌ రూరల్,ములుగు,మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు అభినందలు తెలిపారు.
 
సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం..
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. జిల్లాలో మాస్‌ ఫాలోయింగ్‌ కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పర్వతగిరిలో ఓ సాధారణ రేషన్‌ లీడర్‌ నుంచి ప్రారంభమైన ఆయన జీవితం రాజకీయాల్లోకి రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలో పలు పదవులను చేపడుతూ మ రోవైపు ప్రజాప్రతినిధిగా వరుస ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తూ రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన తీరు అమోఘం.

విద్యార్థిదశ నుంచే నాయకత్వ లక్షణాలను కలిగిన దయాకర్‌రావు సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర మంత్రి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1982లో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2008లో వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొం దారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలుపొందారు. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

పాలకుర్తి: నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే మంత్రిని అయ్యానని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మంత్రిగా హైదరాబాద్‌లో మంగళవారం బాధ్యతలు స్వీకరించగా.. నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చడంతోపాటు నృత్యాలు చేశారు. దయాకర్‌రావుకు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్ధేశించి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో మంత్రి పదవిని అప్పగించారని, దానిని వమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించి పదవికి వన్నె తెస్తానని చెప్పారు. మూడు దశాబ్దాల కార్యకర్తల కల నేడు నెరవేరిందని, ఊరూరికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు తెచ్చి చెరువులను నింపుతామని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయమని, కరువు ప్రాంతమైన పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కార్యచరణ రూపొందిస్తానని తెలిపారు. ప్రజల కోరిక మేరకు త్వరలో అన్ని మండలాలు పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top