పోలీస్‌ అధికారులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

Bulletproof vehicles for police officers - Sakshi

డీజీపీ, ఐజీలతో పాటు పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోలీస్‌ శాఖ కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను సమకూర్చింది. ఇందులో భాగంగా డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్, డీఐజీలు ప్రభాకర్‌రావు, రాజేశ్‌కుమార్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్‌ రవీంద్ర, కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌ భగవత్, సత్యనారాయణ, రవీందర్, భూపాలపల్లి, భద్రాచలం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా ఎస్పీలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫార్చూనర్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు.  

జగన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వలేదు.. 
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలను వారు ఖండించారు. ఏపీ నుంచి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చే సమయంలో మాత్రం రాష్ట్ర పోలీస్‌ శాఖ తరఫున ఎస్కార్ట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఏపీ ప్రభుత్వమే వాహనం సమకూర్చాల్సి ఉంటుందని, తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top