2020 జూన్‌కి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు 

BSNL 5G services for June 2020 - Sakshi

  దేశంలో తొలిసారిగా 5జీ సేవలు 

  ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించేందుకు చర్యలు

  ఎన్‌సీఎన్‌జీఎన్‌ కేంద్ర సర్కిల్‌ సీజీఎం అనిల్‌ జైన్‌  

సాక్షి, హైదరాబాద్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలను 2020 జూన్‌ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌సీఎన్‌జీఎన్‌) కేంద్ర సర్కిల్‌ సీజీఎం అనిల్‌ జైన్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ టెలికం సర్కిల్‌ దూర సంచార్‌ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటగా 5జీ సేవలను ప్రవేశపెట్టే సర్వీస్‌ ప్రొవైడర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ అని అన్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జర్మనీ, చైనా, అమెరికాతోపాటు దేశంలో కూడా 5జీ టెస్టింగ్‌ నిర్వహించామన్నారు. ఇప్పటికే 5జీ కోసం ఒప్పందాలు, స్పెక్టమ్‌ కేటాయింపు చర్యలు చేపట్టామని తెలిపారు.  

ల్యాండ్‌లైన్‌కు ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. 
బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌కు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ సౌకర్యం వర్తింపజేస్తున్నట్లు అనిల్‌ జైన్‌ ప్రకటించారు. రూ.200 ప్లాన్‌ కింద ఎలాంటి డిపాజిట్‌ లేకుండా కొత్త కనెక్షన్‌కు ఇన్‌స్టలేషన్‌ ఉచితమని, దీనికి 30 రోజుల కాలపరిమితితోపాటు రూ.200 విలువగల టాక్‌ టైమ్‌ వర్తిస్తోందన్నారు. ఈ నెల 25 నుంచి ల్యాండ్‌లైన్‌ ప్రీపెయిడ్‌ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. బ్రాడ్‌బాండ్‌ సేవలకు కొత్తగా నాలుగు ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

24 గంటలు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు ప్లాన్‌ను బట్టి రోజుకు 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 20 జీబీ డాటా వరకు వర్తిస్తోందని తెలిపారు. అదేవిధంగా ఫైబర్‌ కాంబో ప్లాన్‌ కింద 50 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ వరకు, 500 జీబీ నుంచి 750 జీబీ వరకు డాటా వర్తిస్తోందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్యామిలీ బీబీ కాంబో ప్లాన్‌ 1199 కింద బ్రాండ్‌బాండ్, ల్యాండ్‌లైన్, మూడు మొబైల్‌ కనెక్షన్‌ల సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో తెలంగాణ టెలికం సర్కిల్‌ సీజీఎం వి.సుందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top