ఇక.. ప్రలోభాల జాతర 

The Brutal Election Campaign For Three Months Was Broken On Wednesday - Sakshi

పల్లె, పట్టణాన్ని హోరెత్తించిన పార్టీలు 

పలు సభల్లో పాల్గొన్న అగ్రనేతలు 

పోలింగ్‌కు ఒక రోజే గడువు 

తాయిళాలిచ్చేందుకు నాయకులు సిద్ధం!

నోళ్లకు తాళం పడింది. మైకుల మోత ఆగిపోయింది. మూడు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి బుధవారం బ్రేక్‌ పడింది. మరో 24 గంటల్లో తుదిపోరు ప్రారంభం కానుంది. కీలకఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చివరి నిమిషంలో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఓటర్లకు నగదు ఆశ జూపుతున్నారు. ఇప్పటికే మందు, విందులతో నిండిపోయిన పల్లెలు.. రాజకీయం క్లైమాక్స్‌ చేరడంతో మరింత హాట్‌హాట్‌గా మారాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 163 మంది బరిలో నిలిచారు. కేవలం ప్రధాన పార్టీలేగాకుండా తొలిసారి చిన్నా చితక పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గెలుపే ధ్యేయంగా జట్టుకట్టిన టీడీపీ–కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమి ఒకవైపు.. మరోసారి విజయం సాధించాలని ముందస్తు సమరానికి సై అన్న టీఆర్‌ఎస్‌ మరోవైపు.. మెరుగైన ఫలితాలను సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇంకోవైపు.. పోటాపోటీగా సమరక్షేత్రంలోకి దిగాయి. మొదటి రోజే అభ్యర్థులను ప్రకటించి శంఖారావం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్‌ జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం మినహా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సైతం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  

అలుపెరగకుండా..  
శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారథులతో ప్రచారపర్వం కొనసాగించిన ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మునుపెన్నడూలేని రీతిలో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ముందస్తు సంకేతాలు రావడమే తరువాయి రాజేంద్రనగర్‌లో దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌లో పర్యటించారు. అగ్రనేతలు గులాంనబీ అజాద్, అజారుద్దీన్, సినీ తారలు విజయశాంతి, నగ్మా, కుష్బూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. 

చంద్రబాబు సైతం.. 
ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్, మహేశ్వరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. 

హోరెత్తించిన కమలదళం 
బీజేపీ అధినేత అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హాన్స్‌రాజ్, గంగ్వార్, స్మృతి ఇరానీ, పురందేశ్వరి, స్టార్‌ క్యాంపెయినర్‌ పరిపూర్ణానంద తదితరులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కమలం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ టికెట్లు దక్కకపోవడంతో ఏనుగెక్కిన మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్‌లు ప్రజాకూటమి, కాంగ్రెస్‌ అభ్యర్థులకు తీసిపోని రీతిలో ప్రచారం హోరెత్తించారు. 

ఉరుకులు పరుగులకు తెర 
ఉరుకులు పరుగులకు తెరపడింది. ఇక ఉత్కంఠ మిగిలింది. ఎన్నికల క్రతువులో కీలక రోజుగా భావించే ఈ కొన్ని గంటల్లో ఫలితాన్ని తారు మారు చేసేందుకు అభ్యర్థులు తెర వెనుక రాయ‘బేరాలు’ కొనసాగిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు.. చీకట్లో చిత్తులు చేసే కార్యక్రమం మొదలు కానుంది. వీరి భవితవ్యం 11న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top