పేదల 'తిరుపతి' కురుమూర్తి కొండలో బ్రహ్మోత్సవాలు

Brahmotsavalu In Kurumurti Temple Which Known To Be The Tirupati For Poor - Sakshi

ఆలయంలో మార్మోగిన గోవింద నామస్మరణ 

పలువురు భక్తులు కురుమూర్తిస్వామి మాలధారణ

సాక్షి, దేవరకద్ర: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఎడ్లబండ్లపై, ప్రవేటు వాహనాలు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్గించారు. భక్తులు మెట్లపై గోవింద నమస్మరణ చేస్తు శరణ గోశ వినిపించారు. జాతర మైదానంలో భక్తులు దాసంగాలు, గండదీపాలు మోసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో దుకాణ సముదాయాలు, గాజుల దుకాణాలు, హోటళ్లు కిటకిటలాడాయి. ఇదిలాఉండగా, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. 


జాతర మైదానంలో దాసంగాలు పెట్టేందుకు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కుండలు; ఎడ్లబండ్లపై వస్తున్న భక్తులు; కర్ణాటక రాష్ట్రం నుంచి కురుమూర్తిస్వామి మాలధారణతో పాదయాత్రగా వస్తున్న భక్తులు

పాదయాత్రగా కురుమూర్తి కొండలకు..
కొందరు భక్తులు కురుమూర్తిస్వామి మాలధారణను ధరించి పాదయాత్రలతో స్వామివారి చెంతకు చేరుకోని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కర్ణాటక రాష్టానికి చెందిన యాదగిరి నుంచి భక్తులు కురుమూర్తి స్వామి మాలను ధరించి పాదయాత్ర చేస్తు మంగళవారం కురుమూర్తి కొండకు చేరుకున్నారు. నియమ నిష్టలతో వారంరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పాదయాత్రను చేపట్టినట్టు భక్తుల తెలిపారు. ప్రతి సంవత్సరం కురుమూర్తి మాలధారణ ధరించే భక్తుల సంఖ్య పెరుగుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top