చర్లలో బాంబు కలకలం

Bomb sensation at Cherla mandal - Sakshi

     పోలీసులను గమనించి బ్యాగును వదిలి వెళ్లిన మావోయిస్టు 

     ఆరున్నర గంటల పాటు తీవ్ర ఉత్కంఠ  

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో శుక్రవారం బాంబు ఉందన్న వార్త కలకలం సృష్టించింది. సుమారు ఆరున్నర గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చర్ల బస్టాండ్‌ ముందు ఉన్న మూడు రోడ్ల కూడలిలో ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్‌లో బస్సు దిగిన గుర్తు తెలియని వ్యక్తి (మావోయిస్టు) బయటకు వెళ్తూ బస్టాండ్‌ ముందు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించాడు. అతని వద్ద ఉన్న బ్యాగును ఔట్‌గేట్‌లో వదిలిపెట్టి బస్టాండ్‌లోకి కొంత దూరం సాధారణంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి పరుగెత్తాడు.

ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రాజువర్మ ప్రత్యేక బలగాలతో అక్కడకు చేరుకుని బ్యాగును పరిశీలించారు. బాంబు ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్తగూడెం నుంచి బాంబు డిస్పోజల్‌ టీంను పిలిపించారు. ఉదయం 8.30కి  బాంబును గుర్తించగా, మధ్యాహ్నం వరకు నిర్వీర్యం చేయకపోవడంతో ఏమి జరుగుతుందోనంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు బ్యాగును తాడు సహాయంతో లాక్కెళ్లి బస్టాండ్‌ వెనుక ఉన్న చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో వచ్చిన భారీ పేలుడు శబ్దానికి జనం భయభ్రాంతులకు గురయ్యారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top