వీడని ' సీటు' ముడి

BJP Leaders Fighting For Maheshwaram Constituency Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  మహేశ్వరం బీజేపీ టికెట్‌ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పార్టీ అధినేత అమిత్‌షా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసిన జాబితాలో ఈ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసినా ప్రకటించకుండా పెండింగ్‌ లో పెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. మహేశ్వరం టికెట్‌ రేసులో బీజేపీ జిల్లా సారథి బొక్క నర్సింహారెడ్డి, సీనియర్‌ నేతలు అందె శ్రీరాములు, ఎ.శంకర్‌రెడ్డి పోటీపడుతున్నారు. ఈ ముగ్గురి పేర్లను పరిశీలించిన అధినాయకత్వం బొక్క నర్సింహారెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా మూడో జాబి తాలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే, అనూహ్యంగా ఆయన పేరు నాలుగో జాబితాలో కూడా లేకపోవడం తో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

నర్సింహారెడ్డి అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడడానికి సంఘ్‌ పరివార్‌ జోక్యమేనని ప్రచారం జరుగుతోంది. శ్రీరాములును అభ్యర్థిగా ప్రకటించాలని సంఘ్‌ పెద్దలు ఒత్తిడి తెస్తుండడంతో టికెట్‌ అంశం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గాల్లో మహేశ్వరం ఒకటి కావడం.. ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు బలీయంగా ఉండడం.. ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి వస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు నామినేషన్ల దాఖలుకు ఒక రోజే గడువు మిగిలి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా సస్పెన్స్‌కు ముగింపు పలకాలని రాష్ట్ర కమిటీకి జాతీయ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సీనియర్‌ నేత గంగాపురం కిషన్‌రెడ్డిని ఈ ఇరువురు ఆశావహులతో చర్చించి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ఆదేశించడంతో శనివారం రాత్రి ఇద్దరు నాయకులతో కిషన్‌రెడ్డి మాట్లాడినట్లు సమాచారం.
 
కరణం రాజీనామాతో.. 
వికారాబాద్‌ బీజేపీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు రాజీనామాతో పరిగి అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. ఈ నియోజకవర్గానికి ఇతర పార్టీ నుంచి బలమైన వ్యక్తిని బరిలో దించాలని అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో పరిగి సీటును ప్రకటించకుండా పక్కనపెట్టింది. మూడు జాబితాలు విడుదల చేసినా తన పేరు లేకపోవడంతో ప్రహ్లాదరావు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న సదరు నేత.. ఆ పార్టీ తుది జాబితా విడుదల చేస్తే తప్ప నిర్ణయం వెల్లడించే పరిస్థితి లేదు. దీంతో అనివార్యంగా కరణం వైపే బీజేపీ హైకమాండ్‌ మొగ్గుచూపుతోంది. ఇదిలావుండగా, వికారాబాద్‌ టికెట్‌ను మాజీ పోలీస్‌ అధికారి సాయికృష్ణకు కేటాయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top