బీజేపీ ‘గాంధీ సంకల్పయాత్ర’ | BJP Gandhi Sankalpa Yathra In Adilabad Said Soyam Bapurao | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘గాంధీ సంకల్పయాత్ర’

Oct 2 2019 9:25 AM | Updated on Oct 2 2019 9:25 AM

BJP Gandhi Sankalpa Yathra In Adilabad Said Soyam Bapurao - Sakshi

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు

సాక్షి,ఆదిలాబాద్‌: కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు బుధవారం నుంచి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో 8 నుంచి 12గ్రామాల వరకు పర్యటించేలా పాదయాత్ర రూపొందించారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 2 నుంచి 31వరకు దేశ వ్యాప్తంగా గాంధీ సంకల్ప్‌ యాత్రను ఆ పార్టీ నిర్వహించనుంది. గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఎంపీలు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.

యాత్ర వివరాలు..
జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ నుంచి ఈ సంకల్ప యాత్ర ప్రారంభమవుతోంది. ఎంపీ సోయం బాపురావు చేపడుతున్న ఈ పాదయాత్రలో భాగంగా మొదటి రోజు గాంధీచౌక్‌లో ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌తో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. అక్కడి నుంచి లాండసాంగ్వి, అర్లి, అడ, కంఠ, పార్డి(బి), పార్డి(కె), రామాయి గ్రామాల మీదుగా సాగుతోంది. 3న బోథ్‌ నియోజకవర్గానికి చేరుకొని గొల్లపుర, పార్డి(కె) మామిడిగూడ, చింతల్‌బోరి, దేవుల్‌నాయక్‌తాండ, సంపత్‌నాయక్‌తాండ, పార్డి(కె), గుట్టపక్కతాండ, గుర్రాలతాండ, సొనాల గ్రామాల మీదుగా సాగుతుంది.

4న నిర్మల్‌ జిల్లాకు చేరుకుని మొదట ఖానాపూర్‌ నియోజకవర్గంలోని 12 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత 5న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చేరుకుని 11గ్రామాల్లో సంకల్ప యాత్ర కొనసాగించనున్నారు. 6న తిరిగి బోథ్‌కు చేరుకొని 11 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. అనంతరం దసరా పండగ నేపథ్యంలో 7, 8వ తేదీల్లో విరామం ఇచ్చి మళ్లీ 9వ తేదీన ముథోల్‌ నియోజకవర్గానికి చేరుకొని ఎనిమిది గ్రామాల్లో పాదయాత్ర చేపడతారు. అందులో భైంసా పట్టణంలో కూడా ఉంది. ఇక్కడి నుంచి నిర్మల్‌ నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోనూ ఈ యాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత 11వ తేదీన కాగజ్‌నగర్‌ చేరుకుని 11 గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు.

మున్సిపోల్స్‌లో మైలేజ్‌ కోసం..
రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో మైలేజ్‌ కోసం కూడా ఈ సంకల్ప యాత్రను బీజేపీ ఉపయోగించుకుంటుంది. ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో ఈ యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో కార్యకర్తలు, అభిమానుల్లో జోష్‌ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సోయం బాపురావుకు ఆయా జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గాంధీ జయంతి సందర్భంగా
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజా సంబంధాలు, స్వచ్ఛమైన భారతదేశం, సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కలవడమే ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగుతుంది. స్వదేశీ హాత్, ప్రభాత్‌ పేరి వంటి అనేక కార్యక్రమాలు దీంట్లో చేపడుతున్నాం. స్వదేశ్, స్వరాజ్, స్వాలంబన, ఖాది వినియోగం, సూత్రాలను ప్రోత్సహించడం, పాదయాత్రలో జరుగుతుంది.  – ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement