
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు అత్యంత స్వచ్ఛమైనదని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షల్లో తేలింది. దేశంలోని 15 నగరాల నుంచి పది చొప్పున నీటి నమూనాలు తీసుకొని పరీక్షించింది. పదికి పది బాగుండడంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఒక్క నమూనా మాత్రమే ఫెయిలైన హైదరాబాద్, భువనేశ్వర్ రెండో స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం పదో స్థానానికి పరిమితమైంది. 2012లో బీఐఎస్ నోటిఫై చేసిన తాగునీటి ప్రమాణాల ప్రకారం 28 పారామీటర్లుగా తీసుకొని నమూనా పరీక్షలు చేశారు. చాలా వరకు ఫెయిలైన శాంపిల్స్‌లో ఎక్కువగా నీటిలో కరిగిన ఘన పదార్థాలు, మలినాలు, నీటి కాఠిన్యత, లవణీయత, లోహలు, నీటి నాణ్యతకు సంబంధించిన పారామీటర్లు ఉన్నాయి.
నిలువ చేసి.. శుద్ధి చేసి
కోటికిపైగా జనాభా ఉన్న నగరానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జలమండలి ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. 9,80,000 నల్లా కలెక్షన్ల ద్వారా ప్రతిరోజూ 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరితో పాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నీటిని శుద్ధి చేసి నగరవాసులకు కుళాయిల ద్వారా అందిస్తోంది. ఏ కాలంలోనైనా నగరవాసులకు తాగునీటి తిప్పలు ఉండకూడదన్న ఉద్దేశంతో 500కు పైగా రిజర్వాయర్లలో మంచి నీటిని నిలువ చేస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్లలో నిలువ చేసి బ్లాస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు. దీనిద్వారా నీటిలో ఉన్న హానికారక బ్యాక్టీరియ నశించి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు చేరుతోంది. ఇప్పటికే కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న జలమండలికి ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం అందింది. తాజాగా బీఎస్‌ఐ నమూనా పరీక్షల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం దక్కడంతో జలమండలి ఎండీ దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు.