బిర్యానీకి ఫిదా..

Biryani is number 1 in online orders in metro cities - Sakshi

మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో బిర్యానీనే నంబర్‌ 1

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ ఇలా మెట్రో నగరం ఏదైనా లక్షలాది మంది నగరవాసులు చికెన్‌ బిర్యానీపైనే మనసు పారేసుకుంటున్నారట. లంచ్‌.. డిన్నర్‌.. లేట్‌నైట్‌.. ఇలా సమయం ఏదైనా వేడివేడి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసేందుకే మౌస్‌ను క్లిక్‌ మనిపిస్తున్నారట. ఆహార ప్రియులు చికెన్‌ బిర్యానీకే ఓటేస్తుండటంతో ఆర్డర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగి ఈ వంటకం నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందట.

మసాలా దోశ, బటర్‌ నాన్, తందూరీ రోటీ, పన్నీర్‌ బటర్‌ మసాలా ఐటమ్స్‌ ఆ తర్వాత నాలుగు స్థానాలు దక్కించుకున్నాయట. ఇక పిజ్జా, బర్గర్, చికెన్, కేక్, మోమోస్‌కు కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయట. 2017 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 9 మధ్య ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థకు అందిన ఆర్డర్లపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థ ప్రధానంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో తమ సంస్థకు అందుతున్న ఫుడ్‌ ఆర్డర్లపై ఈ సర్వేను నిర్వహించింది.

ఈ వంటకాలకు భలే గిరాకీ..

ముంబై: చికెన్‌ బిర్యానీకే ముంబై నగరవాసులు మొగ్గు చూపుతుండటం విశేషం. ఆ తర్వాత పావ్‌భాజీని ఇష్టపడుతున్నారు. రోస్టెడ్‌ చికెన్‌ సబ్, చికెన్‌ మోమోస్‌కు గిరాకీ బాగుంది. ప్రధానంగా బాంద్రా వెస్ట్, పోవాయ్, అంధేరీ వెస్ట్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ, గుర్గావ్‌: ధాల్‌ మకానీ, నాన్, బటర్‌ చికెన్‌లకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఆ తర్వాత పాస్తాకు గిరాకీ బాగుంది. జనక్‌పురి, గ్రేటర్‌ కైలాశ్, ద్వారక, పాలమ్‌ విహార్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి.

హైదరాబాద్‌: బిర్యానీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ప్రధానంగా 20 రకాల బిర్యానీ రుచులను గ్రేటర్‌ నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత చికెన్‌ 65ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జూన్, అక్టోబర్‌ నెలల్లో స్విగ్గీకి ఫుడ్‌ ఆర్డర్ల సంఖ్య పెరిగింది. మాదాపూర్, బంజారాహిల్స్, కొండాపూర్‌ నుంచి అధికంగా ఆర్డర్లు వస్తున్నాయి.

బెంగళూరు: చికెన్‌ బిర్యానీ, చికెన్‌ లాలీపప్స్, మంచోసూప్, నూడుల్స్, ఫ్రైడ్‌ రైస్‌లను ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు.

కోల్‌కతా: బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, కచోరిలకు ఆర్డర్లు బాగున్నాయి.

చెన్నై: పొంగల్, బిర్యానీ, చికెన్‌ లాలీపప్స్‌కు గిరాకీ బాగుంది.

పుణే: దాల్‌ కిచిడి, బిర్యానీ, మ్యాంగో, స్ట్రాబెర్రీ, చాక్లెట్‌ షేక్స్‌కు గిరాకీ ఎక్కువ.

ఏ సమయంలో ఏ వంటకం తింటున్నారంటే..
బ్రేక్‌ఫాస్ట్‌: మసాలా దోశ, ఇడ్లీ, వడ అగ్రస్థానంలో ఉన్నాయి. ఉదయం 9.30 గంటలకు ఆర్డర్లు బాగున్నాయి.

లంచ్, డిన్నర్‌: చికెన్‌ బిర్యానీ, ఆ తర్వాత మటన్, వెజ్‌ బిర్యానీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు.. రాత్రి 8.58 గంటలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి.

స్నాక్స్‌: పావ్‌భాజీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్, సమోసా, చికెన్‌ రోల్, చికెన్‌ బర్గర్, భేల్‌పూరికి ఆర్డర్లు బాగున్నాయి. సాయంత్రం 5.03 గంటలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.

లేట్‌ నైట్‌: చికెన్‌ బిర్యానీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్, బటర్‌ చికెన్, న్యూటెల్లా బ్రౌనీ ముందున్నాయి. లేట్‌ నైట్‌ ఆర్డర్లలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి.

మెట్రో సిటిజన్లు ఇష్టపడుతున్న స్వీట్లివే..
గులాబ్‌ జామూన్, డబుల్‌ కా మీటా, రస్‌మలాయ్, టెండర్‌ కోకోనట్‌ ఐస్‌క్రీమ్‌లు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top