పిట్ట ‘కొంచెమే’!

Birds Decrease In Metro Cities Due To Pollution And Radiation - Sakshi

80% పక్షి జాతుల తగ్గుదల

గత 25 ఏళ్లలో క్రమంగా తగ్గిపోతున్న జాతులు

ఎస్‌వోఐబీ–2020 నివేదికలో వెల్లడి

పెస్టిసైడ్స్‌ వినియోగం, రేడియేషన్‌లే ప్రధాన కారణాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఏడాదికి వివిధ రకాల సాధారణ పక్షుల్లో 80 శాతం వరకు తగ్గిపోతున్నాయి. గత 25 ఏళ్ల కాలంలో దేశంలోని ఐదో వంతుకు పైగా వివిధ పక్షి జాతుల (షార్ట్‌ టోవ్డ్‌స్నేక్‌ ఈగిల్‌ (గద్ద) మొదలుకుని సర్కిర్‌ మల్కోటాగా పిలిచే చిన్నపక్షి వరకు) సంఖ్య తగ్గిపోయింది. ఊర పిచ్చుక, పిట్ట వంటి సాధారణంగా కనిపించే పక్షిజాతి క్షీణత నుంచి కొంత మెరుగు పడినా... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలోనే తొలిసారిగా వివిధ రకాల పక్షి జాతులపై స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌–2020 (ఎస్‌వోఐబీ) పేరిట డబ్ల్యూడబ్ల్యూఎఫ్, నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ, వైల్డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, వెట్‌ల్యాండ్‌ ఇంటర్నేషనల్, నేచర్‌ కన్జర్వేషన్‌ ఫౌండేషన్, ఏ ట్రీ, బీఎన్‌హెచ్‌ఎస్‌ ఇండియా, ఎఫ్‌ఈఎస్, ఎన్‌సీబీఎస్, సాకాన్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సమగ్ర నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ–బర్డ్‌ ప్లాట్‌ఫామ్‌పై 867 భారత పక్షుల రకాలకుసంబంధించి 15,500 మందికి పైగా పక్షి వీక్షకులు తమ పరిశీలనాంశాల ఆధారంగా ఒక కోటికి పైగా అప్‌లోడ్‌ చేసిన వివరాలు, సమాచారం ప్రాతిపదికన ఈ నివేదికను తయారు చేశారు. పక్షుల సంఖ్య తగ్గిపోవడానికి స్పష్టమైన కారణాలు కనుక్కోవాల్సిన అవసరముందని సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నివేదిక విడుదల సందర్భంగా ఎస్‌వోఐబీ సభ్యుడు సోహెల్‌ ఖాదర్‌ పేర్కొన్నారు.

రామ చిలుకల నుంచి కాకుల దాకా...
రాష్ట్రంలో రామ చిలుకలు, పాలపిట్ట, పిచ్చుకలు, గద్దలు చివరకు కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. అదే సమయంలో మనుషులకు ఆరోగ్యపరంగా నష్టం చేకూర్చే పావురాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతోంది. పావురాల విసర్జనలు ఎండిపోయాక పొడిగా మారి గాలిలో కలిసి మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పక్షుల్లో మొండిజీవిగా, ఎక్కడైనా బతకగలిగే ఓర్పు, నేర్పు ఉన్న జీవిగా గుర్తింపు పొందిన కాకులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. గతంలో ఎక్కడ చూసినా కాకుల గుంపులు కనిపించేవి.. ఇప్పుడు ఇక్కడొకటి అక్కడొకటి మాత్రమే కనిపిస్తున్నాయని ఆయా రకాల పక్షుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పక్షుల సంఖ్య ప్రమాదకరంగా తగ్గిపోవడానికి... నగరీకరణ పెరిగి చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం ఒక కారణం కాగా.. కాలుష్యం, వివిధ రూపాల్లోని రేడియేషన్‌ మరో కారణం. అదేవిధంగా పంటలు పండించడంలో, పండ్ల చెట్ల పెంపకంలో పురుగు మందులు, రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం ముఖ్య కారణం. 

కాలుష్యం, రేడియేషన్‌ ప్రభావం
‘పక్షులు స్వేచ్ఛగా పెరిగే వాతావరణం తగ్గిపోవడం, కాలుష్యం పెరగడంతో పాటు వివిధ రూపాల రేడియేషన్‌తో పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. గత 15 ఏళ్లుగా ఆయా అంశాలను దగ్గర నుంచి గమనిస్తున్న నాకు పక్షుల సంఖ్యలో తగ్గుదల స్పష్టంగా గోచరిస్తోంది. పక్షులను కాపాడుకోవడంలో ప్రజల జీవన విధానం, అనుసరిస్తున్న పద్ధతుల్లో కచ్చితమైన మార్పు రావాల్సిన అవసరముంది. కాలుష్యం, రేడియేషన్‌ పెరగడంతో పక్షులు గుడ్లు పెట్టినా వాటిని పొదగడం లేదు. ఆధునిక వసతులతో కూడిన వ్యవస్థ, దానితో పాటు ప్రకృతి, పర్యావరణం రెండూ అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటేనే ప్రాణకోటికి మనుగడ. పక్షులను కాపాడుకుని, అవి సహజ సిద్ధంగా ఉండేలా చేసినపుడే మానవాళికి కూడా వివిధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది’. –సాక్షితో జి.సాయిలు, ఫారెస్ట్‌ ప్లస్‌ 2.0 రీజినల్‌ డైరెక్టర్, బయో డైవర్సిటీ కన్జర్వేషనలిటిస్ట్

భారీగా పెస్టిసైడ్స్‌ వినియోగంతో తీవ్ర నష్టం
‘పంటల దిగుబడి పెంచేందుకు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయనాల వినియోగం పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలపిట్ట వంటి పక్షి పంట పొలాలపై క్రిములను తిని జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం పెస్టిసైడ్స్‌ను అడ్డూఅదుపు లేకుండా ఉపయోగిస్తుండటంతో క్రిమి, కీటకాలు లేక పాలపిట్టల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రామ చిలుకలు, ఊర పిచ్చుకలదీ ఇదే పరిస్థితి. పండ్ల చెట్లు ఎక్కువ ఫలాలు ఇచ్చేందుకు పురుగు మందులు వినియోగిస్తుండటంతో వాటిని తిని రామచిలుకలు చచ్చిపోవడమో లేక వాటి పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమో జరుగుతోంది’.  – ‘సాక్షి’తో శంకరన్, వల్డ్‌లైఫ్‌ విభాగం ఓఎస్డీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top