నూతన విధానంలో భాగంగా ప్రతీ హాస్టల్‌కు బయో మెట్రిక్ మిషన్లు, ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందూరు: నూతన విధానంలో భాగంగా ప్రతీ హాస్టల్‌కు బయో మెట్రిక్ మిషన్లు, ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. జిల్లాలో మొత్తం 62 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఒక్కో వసతి గృహంలో వంద మంది విద్యార్థులను చేర్చుకునే అవకా శం ఉంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్నారు.
కొందరు వార్డెన్‌లు విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా రాసుకుంటూ వారి పేరిట కాస్మొటిక్ చార్జీలు, దుస్తులు, దుప్పట్లు, తదితరవాటిని తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. గాంధారి, కామారెడ్డి వసతిగృహాలలో ఇది వరకే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వార్డెన్‌ల బాగోతాన్ని బయటపెట్టారు. విద్యార్థుల సంఖ్య ఉన్న వారికంటే ఎక్కువగా చూపుతున్నారనే నిజాలు సైతం బయటపడ్డాయి. ఇకపై ఇలాంటి అక్రమాలకు అడ్డు కట్ట వేయడానికి బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా ఈ-హాస్టల్‌కు అనుసంధానం చేయనున్నారు.
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రతి విద్యార్థికి సంబంధించిన వేలి ముద్రలను బయోమెట్రిక్ మిషన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా వారి హాజరు ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. లేని విద్యార్థులను ఉన్నట్లుగా చూపించే అవకాశం ఉండదు. ఒకవేళ విద్యార్థి ఉండి కూడా వేలి ముద్రలు నమోదు చేయకపోతే వార్డెన్లు నష్టపోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఆ విద్యార్థికి సంబంధించిన సరుకులకు అనుమతి ఉండదు. వేలిముద్రలు నమోదు చేసినవారికి మాత్రమే సరుకులను పంపిణీ చేస్తారు. వార్డెన్‌లు అక్రమాలకు పాల్పడితే వెంటనే దొరికిపోతారు.
వార్డెన్‌లకు ల్యాప్‌టాప్‌లు అందజేసీన జేడీ
అక్రమాలను అరికట్టే విధానంలో భాగంగా ప్రభుత్వం వసతి గృహాలకు ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసింది. జిల్లాలో సొంత భవనాలున్న ఎస్‌సీ వసతిగృహాలకు వీటిని అందజేశారు. ఒక్కో ల్యాప్‌టాప్ నకు రూ.35 వేల వరకు ఖర్చు చేసి వాటిని జిల్లాకు పంపింది. మంగళవారం నిజామాబాద్ ఏఎస్‌డబ్ల్యూ ఓ కార్యాలయంలో వీటిని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్ వార్డెన్‌లకు పంపిణీ చేశారు.
ల్యాప్‌టాప్‌లలో సాప్ట్‌వేర్‌ను లోడ్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఇంజనీర్‌ను రప్పించారు. ల్యాప్‌టాప్‌ల ద్వారా వసతిగృహాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని రోజువారీగా ఆన్‌లైన్ చేయాలి. డ్రెస్ మెటీరియల్, నోట్‌బుక్కులు, కార్పెట్లు, కాస్మొటిక్ చార్జీలు, ఖర్చు, స్టాక్ తదితర వివరాలన్నీ ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. నిధులకు సంబంధించిన వివరాలు కూడా చేర్చాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను ఏ వసతిగృహానికి సంబంధించినవైనా నెట్‌లో చూడవచ్చు. ప్రభుత్వం అందజేసిన ల్యాప్‌టాప్‌లను జాగ్రత్తగా వినియోగించాలని జేడీ ఖాలేబ్ వార్డెన్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎస్‌డబ్ల్యూఓ జగదీశ్వర్‌రెడ్డి, వార్డెన్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టీ, బీసీ వసతి గృహాల సంగతేమిటో!
జిల్లాలో 42 బీసీ, 13 ఎస్‌టీ వసతి గృహాలున్నాయి. వీటిలో కూడా అక్రమాలు జరగడం లేదనడానికి ఆస్కారం లేదు. వాటిని నిలువరించడానికి ఇక్కడ కూడా బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.