రారండోయ్‌..పెబ్బేరు సంతకు

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంత

రైతులకు అందుబాటులో అన్ని పనిముట్లు

నిత్యావసర వస్తువులు, కూరగాయలు

దూరాప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వ్యాపారులు, కొనుగోలుదారులు

ప్రత్యేకం.. పశువుల సంత
పెబ్బేరు(కొత్తకోట): మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే సంత తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంతగా పేరొందింది. ఈ సంతలో అటు రైతులకు ఇటు సాధారణ ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, పనిముట్లు లభిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు. పండగలు, శుభకార్యాల కోసం కావాల్సిన వస్తువులు, వ్యవసాయ పరికరాలు, నిత్యావసర వస్తువులు ఇలా అన్ని రకాల వస్తువులు లభించడం పెబ్బేరు సంత ప్రత్యేకత. 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఉండడంతో పాటు వివిధ ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న పెబ్బేరు సంత రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది.

పెబ్బేరు సంత మూడు విభాగాల్లో కొనసాగుతోంది. పశువుల సంత, గొర్రెల సంత, తైబజారు పేరున ఉంటాయి. పశువుల సంతలో వివిధ రకాల ఆవులు, గేదెలు, ఎద్దులు అమ్మడం, కొనడం చేస్తుంటారు. పశువుల సంతలో వివిధ రకాల పశువులు రూ.10వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు ధర పలుకుతుంటాయి. వాటిలో సేద్యం చేసే ఎద్దులతో పాటు ఒంగోలు గిత్తలు, బండలాగుడు ఎద్దులు ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి భారీగా వ్యాపారులు, కొనుగోలుదారులు వస్తుంటారు. దీంతో పాటు ముర్రా జాతి గేదెలు, సాధారణ గేదెలు, జెర్సీ ఆవులు అమ్మడం, కొనడం జరుగుతుంటుంది.

రూ.2.7కోట్లకు చేరిన ఆదాయం
పెబ్బేరు సంత ద్వారా స్థానిక గ్రామపంచాయతీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం రూ.2.7కోట్లకు చేరింది. 1984 సంవత్సరంలో మొదట రూ.10వేలతో ప్రారంభమైన సంత ఆదాయం ఏడాదికేడాదికి పెరిగి ప్రస్తుతం రూ.2.7కోట్లకు చేరింది. అత్యధిక ఆదాయంతో పాటు అతిపెద్దగా పెబ్బేరు సంతకు పేరు రావడంతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. పెబ్బేరు సంత ద్వారా మొత్తం మూడు విభాగాల్లో కాంట్రాక్ట్‌ పొందుతూ సుమారు 300 కుటుంభాలు పరోక్షంగా జీవనోపాధిని పొందుతున్నాయి. సంతలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసి వ్యాపారులు, కొనుగోలుదారుల సమస్యలను తీర్చేందుకు అధికారులు కృషిచేయాల్సి ఉంది.

కోళ్ల సందడి
పెబ్బేరు సంతలో వివిధ రకాల నాటు కోళ్లు సందడి చేస్తున్నాయి. వాటిలో సాధారణ నాటు కోళ్లతో పాటు సీమ కోళ్లు, టర్కి కోళ్లు, గిరిరాజ కోళ్లు, చిత్తూరు కోళ్లు, పందెం కోళ్లు ఉంటాయి. పందెం కోళ్లు రూ.3వేల నుంచి 5వేల వరకు ధర పలుకుతున్నాయి. చిత్తూరు కోళ్లు రూ.1200 నుంచి రూ.1500వరకు లభిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు గిరిరాజ, సీమ, టర్కి కోడి పిల్లలను విక్రయిస్తున్నారు. నాటు కోళ్లతోపాటు కోడిపిల్లలను కోనుగోలు చేస్తుంటారు.

తాజా కూరగాయలు
పెబ్బేరు సంతలో చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పండించిన తాజా కూరగాయలు ఇక్కడ లభ్యమవుతాయి. వారంలో ప్రతి శనివారం స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాజా కూరగాయలు, ఆకుకూరలను కొనుగోలు చేస్తుంటారు. తాజా కూరగాయలతో పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు, కిరాణా సామాగ్రి, వంటసామాగ్రి లభిస్తుంటాయి.

 గొర్రెలు ఫేమస్‌
గొర్రెల సంత పండగలకు ప్రత్యేకంగా మారింది.  మతానికి సంబంధించిన పండగలు వచ్చినా మంచి రుచికర మాంసం కోసం పొట్టేళ్లు, గొర్రెలు, మేకలు తీసుకెళ్తుంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, గొర్రెల కాపరులు ఇక్కడి నుంచి జీవాలను కొనుగోలు చేసి మేపడం కోసం తీసుకెళ్తుంటారు. సాధారణ జాతి గొర్రెలతో పాటు కొండ పొట్టేళ్లు ఇక్కడ లభిస్తాయి.

అందుబాటులో వ్యవసాయ పరికరాలు
పెబ్బేరు సంతలో రైతులకు కావాల్సిన అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు, పరికరాలు లభిస్తాయి. సరసమైన ధరలలో తాళ్లు, నాగళ్లు, గొర్రు, గుంటికలు, పశువుల అలంకరణ వస్తువులు దొరుకుతాయి. దీంతో రాయలసీమ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వారికి కావాల్సిన పరికరాలను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తుంటారు. అంతేకాకుండా గృహోపకరణాలు తలుపులు, కిటికీలు, మంచాలు కూడా లభిస్తాయి. రైతులకు, పశువుల కాపరులకు, గొర్రెలకాపరులకు అవసరమయ్యే ఉన్నితో చేసిన గొంగళ్లు, జాడీలు, ప్లాస్టిక్‌ కవర్లు అందుబాటులో ఉంటాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top