దొడ్డు అన్నం తినేదెట్లా..?

The bhuvanagiri gurukula school students suffering from the lunch menu - Sakshi

భోజన మెనూతో ఇబ్బంది పడుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులు

నీళ్లచారు, దొడ్డు అన్నం వడ్డిస్తున్నారని ఆవేదన

తినలేకపోతున్నామని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదులు

సాక్షి, యాదాద్రి : వివిధ వర్గాలు, అధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సివిల్‌సప్లై కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో రెండు రోజులుగా జిల్లాలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో వరుస దాడులు జరిగాయి. గురువారం సివిల్‌సప్లై టాస్క్‌ పోర్స్‌ ఎస్పీ నాగోబారావు ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని భువనగిరి సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 దీంతో అధికారులు పాఠశాలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థులు మెనూ విషయంలో పలు ఫిర్యాదులు చేశారు. దొడ్డు బియ్యం అన్నం, నీళ్లచారుతో కడుపునిండా తినలేకపోతున్నామని అధికారుల ముందు వారు వాపోయారు. మెనూ పాటిం చడం లేదని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సన్నబియ్యంతో నాణ్యమైన కూరగాయలతో మంచి భోజనం పెట్టించాలని విద్యార్థులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను వేడుకున్నారు. అలాగే పాఠశాల రికార్డుల్లో ఉన్న విధంగా 577 మంది విద్యార్థుల్లో 16 మంది విద్యార్థులు రావడం లేదని తేలింది. వారందరిని రప్పించాలని ప్రిన్సిపాల్‌ను అదేశించారు. ఆత్మకూర్‌ఎం     మండలం ముత్తిరెడ్డిగూడెంలో పీవీఎన్‌రెడ్డికి చెందిన హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో తనిఖీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రేషన్‌దుకాణంలో తనిఖీ నిర్వహించారు.        

అలాగే బుధవారం బీబీనగర్‌ మండలం భట్టుగూడెం కాదంబరి రైస్‌ మిల్‌పై 6 ఏ కేసు నమోదు చేశారు. కస్టం మిల్లింగ్‌ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న స్టాక్‌కు తేడాను గుర్తించి మిల్లుపై కేసు నమోదు చేశారు. భువనగిరిలోని యాదాద్రి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీనివాసరావు, అధికారులు జనార్ధన్‌రెడ్డి, కాశప్ప, వెంకట్‌రెడ్డిలు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top