breaking news
visilance raids
-
'భారత ఆహార సంస్థ' కు నాసిరకం బియ్యం అప్పగింత..!
జగిత్యాల: జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు నాసిరకం బియ్యం అప్పగిస్తున్నారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందాల తనిఖీల్లో ఈ నిజాలు బహిర్గతం కావడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. నిజానికి ఐకేపీ, సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల అధికారులు ఏటా రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిని రైస్‌మిల్లర్లకు అప్పగించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)గా మార్చి ఎఫ్‌సీఐకి అందజేస్తున్నా రు. ఇక్కడే కొందరు మిల్లర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మర ఆడించిన బియ్యాన్ని గోదాములకు తరలిస్తున్న సమయంలో పాత బియ్యాన్ని కూడా కొత్తవిగా చూపుతున్నారు. కేసులు నమోదైనా మారని తీరు.. ► జిల్లాలో 2022లో పౌర సరఫరాలు, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు రైస్‌మిల్లుల్లో చాలాసార్లు తనిఖీలు చేశారు. ► నిబంధనలు అతిక్రమించిన వారిపై 133 కేసులు నమోదు చేశారు. వారినుంచి 4,734 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ► గత జనవరి నుంచి ఇప్పటివరకు 26 కేసులు నమోదు చేసి 275 క్వింటాళ్ల బియ్యం, 4,500 క్వింటాళ్ల ధాన్యం స్వాధీనం చేసుకున్నారు. బయటపడుతున్న నిజాలు.. గతనెల 28న కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారు ప్రభుత్వ గోదాముల్లో విజిలెన్స్ అధి కా రులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన అనుమానాస్పద బియ్యాన్ని సీజ్‌చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు.. ► నాచుపల్లి ప్రభుత్వ గోదాము పర్యవేక్షణాధికారులను మిల్లర్లు మచ్చిక చేసుకుని పాతవాటినే కొత్త బియ్యంగా అప్పగించారని విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. ► 2021–22కి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నిబంధనల ప్రకారం రైస్‌మిల్లర్లు పంపించిన రైస్బ్యాగ్పై బ్లూకలర్ దారం ఉండాలి. ► చాప ప్రింటింగ్, స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు వేయాలి. ► అయితే, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో అవేమీ కనిపించలేదు. ► వాటిని పాత బియ్యంగానే పరిగణించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకంజ వేస్తున్నారని తెలిసింది. ► 2022–23లో మిల్లర్లు తమ బ్యాగులకు రెడ్‌కలర్ దారం, రెడ్‌కలర్ చాప ప్రింటింగ్, రెడ్‌కలర్ స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు బ్యాగ్‌పై వేయాలి. ► మొన్నటి తనిఖీల్లో ఇవేమీ కనిపించలేదు. దీంతో అక్కడ జరుగుతున్న అవినీతి బయటపడింది. ► నిబంధనల ప్రకారం.. బియ్యం రీసైక్లింగ్‌ను అరికట్టేందుకు ఒక ఏడాది ఒక కలర్ దారం, చాప, స్టిక్కర్, మరో ఏడాది మరో కలర్ దారం, చాప ప్రింటింగ్, స్టిక్కర్ ఉండాలి. ► చాలామంది మిల్లర్లు గోదాముల్లోని అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా బియ్యం అప్పగిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. నాచుపల్లి గోదాముల్లో అనుమానాస్పద బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా మిల్లర్లు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది. కేసులు నమోదు చేస్తున్నాం నిబంధనలు పాటించని రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొడిమ్యాల మండలం నాచుపల్లి గోదాముల్లో తనిఖీలు చేయగా అనుమానిత బియ్యం లభించాయి. వాటిని పరీక్షల నిమిత్తం ల్యామ్‌కు తరలించాం. నివేదికలు రాగానే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
దొడ్డు అన్నం తినేదెట్లా..?
సాక్షి, యాదాద్రి : వివిధ వర్గాలు, అధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సివిల్సప్లై కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో రెండు రోజులుగా జిల్లాలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వరుస దాడులు జరిగాయి. గురువారం సివిల్సప్లై టాస్క్ పోర్స్ ఎస్పీ నాగోబారావు ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని భువనగిరి సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పాఠశాలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థులు మెనూ విషయంలో పలు ఫిర్యాదులు చేశారు. దొడ్డు బియ్యం అన్నం, నీళ్లచారుతో కడుపునిండా తినలేకపోతున్నామని అధికారుల ముందు వారు వాపోయారు. మెనూ పాటిం చడం లేదని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సన్నబియ్యంతో నాణ్యమైన కూరగాయలతో మంచి భోజనం పెట్టించాలని విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులను వేడుకున్నారు. అలాగే పాఠశాల రికార్డుల్లో ఉన్న విధంగా 577 మంది విద్యార్థుల్లో 16 మంది విద్యార్థులు రావడం లేదని తేలింది. వారందరిని రప్పించాలని ప్రిన్సిపాల్‌ను అదేశించారు. ఆత్మకూర్ఎం మండలం ముత్తిరెడ్డిగూడెంలో పీవీఎన్రెడ్డికి చెందిన హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తనిఖీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రేషన్‌దుకాణంలో తనిఖీ నిర్వహించారు. అలాగే బుధవారం బీబీనగర్ మండలం భట్టుగూడెం కాదంబరి రైస్ మిల్‌పై 6 ఏ కేసు నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న స్టాక్‌కు తేడాను గుర్తించి మిల్లుపై కేసు నమోదు చేశారు. భువనగిరిలోని యాదాద్రి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీనివాసరావు, అధికారులు జనార్ధన్‌రెడ్డి, కాశప్ప, వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి
సంగెం(వరంగల్): వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లుపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.