గెలిస్తే..రాజభోగమే.. 

Best Facilities For Win Election Leaders - Sakshi

సాక్షి, అశ్వాపురం: పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎలాగైనా గెలిచి పార్లమెంట్‌ మెట్లు ఎక్కేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పలు రకాల వసతులు కల్పిస్తుంది. పదవిలో ఉన్న కాలంలో ఒక ఎంపీకి సెంట్రల్‌ సర్కారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది.. వార్షిక నిధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.  

వేతనం.. 
ఎంపీలకు నెలకు రూ.1 లక్ష వేతనం ఇస్తారు. పదవీ కాలం అయిపోయాక నెలకు రూ.25వేలు పింఛన్‌ వస్తుంది. వేతనంతో పాటు అలవెన్స్‌ల కింద నెలకు రూ.45వేలు అదనంగా ఇస్తారు. 

వసతి.. 
ఎంపీలకు  ఢిల్లీలో నివాస వసతి కల్పిస్తారు. మొదటిసారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలు కేటాయిస్తారు. సీనియర్‌ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు.  

వైద్యం.. 
కేంద్ర పౌరసేవల కింద ప్రభుత్వం ఆరోగ్య పథకం ద్వారా వైద్య, ఆరోగ్య సేవలు కల్పిస్తుంది. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, పాథలాజికల్‌ లాబోరేటరీ సౌకర్యం, హృద్రోగ, దంత, కంటి, ఈఎన్‌టీ, చర్మ, తదితర ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 

ప్రయాణం.. 
ఎంపీలు ఏడాదికి 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం ఉచితం. ఫస్ట్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. జీవిత భాగస్వామికి కూడా అవకాశం ఉంటుంది. రహదారి మీదుగా ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. బస్సులో ఎంపీలకు ప్రత్యేక సీటు ఉంటుంది. 

నిధులు.. 
పార్లమెంట్‌ సభ్యులకు ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు జిల్లా కలెక్టర్‌కు వస్తాయి. ఎంపీ తన పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో గుర్తించిన పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి పనులకు ఈ నిధులు కేటాయిస్తారు. జిల్లా అధికారులు  ఎంపీ సిఫార్సు మేరకు ఆ నిధులు మంజూరు చేస్తారు.  

పార్లమెంట్‌ కార్యాలయ అలవెన్స్‌లు..  
పార్లమెంట్‌ కార్యాలయ అలవెన్స్‌ల కింద ఎంపీలకు నెలకు రూ45వేలను కేంద్రం ఇస్తుంది. వీటిలో రూ.15వేలు స్టేషనరీ, రూ.30 వేలు సహాయ సిబ్బంది, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2వేలు అదనంగా ఇస్తారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top