సిమెంటు కంపెనీల ఒప్పందాలతో లాభం: రైల్వే జీఎం

Benefit from the agreements of cement companies - Sakshi

పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌తో దక్షిణ మధ్య రైల్వే 

దీర్ఘకాల రవాణా ఒప్పందం (ఎల్‌టీటీసీ) 

సాక్షి, హైదరాబాద్‌: సిమెంటు కంపెనీలతో ఒప్పందాల వల్ల సరుకు రవాణా రూపంలో రైల్వేకు ఆదాయం పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. స్థిరమైన రేట్లు, రాయితీల వల్ల ఆయా కంపెనీలకు కూడా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే, పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు దీర్ఘకాలిక సరుకు రవాణా ధర ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన చెప్పారు. వినియోగదారుడు ఒకసారి రైల్వే దీర్ఘకాల ధర సూచి ఒప్పందం(లాంగ్‌ టర్మ్‌ టారిఫ్‌ కాంట్రాక్ట్‌)లో చేరితే ఒక ఏడాది వరకు సరుకు రవాణా ధరలలో మార్పు ఉండదు. దీనివల్ల వినియోగదారుడు ఒక సంవత్సరం వరకు స్థిరమైన సరుకు రవాణా ధరకు అనుగుణంగా వ్యవస్థాగత ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుందన్నారు.

ముందు సంవత్సరం కంటే మరింత ఎక్కువగా రవాణా పెరిగితే ఈ ఒప్పందం ప్రకారం సరుకు రవాణా వినియోగదారుకు చార్జీలో రాయితీ రూపంలో ఎన్నో ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయన్నారు. దీనికి పెరుగుదలతో సంబంధం ఉన్న రాయితీ కనుక గతేడాది కంటే ఎంత ఎక్కువగా సరుకు రవాణా చేస్తే అంత ఎక్కువగా రాయితీలు ఉంటాయన్నారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఎన్‌. మధుసూదన రావు, ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బ్రజేంద్ర కుమార్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె. శివప్రసాద్, చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (ఫ్రైట్‌ సర్వీసెస్‌) డా.బి.ఎస్‌.క్రిష్టోఫర్, పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ డెరెక్టర్‌(మార్కెటింగ్‌) కృష్ణ శ్రీవాస్తవ ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలో ఎం/ఎస్‌. పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ 8వది కాగా మిగతా 7 కంపెనీల్లో ఎం/ఎస్‌. అల్ట్రాటెక్, ఓరియంట్, కేశోరాం, మై హోం, రామ్‌కో, జువారి, భారతీ సిమెంట్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top