16 ఏళ్లయినా.. ప్రచారమేది..? 

Begum Hazrat Mahal National Scholarship In Khammam - Sakshi

మైనార్టీ విద్యార్థుల దరిచేరని స్కాలర్‌షిప్‌  

‘బేగం హజరత్‌ మహల్‌’ పథకానికి ఆదరణ కరువు 

ఉపకార వేతనాలు అందక  విద్యార్థినుల ఇక్కట్లు  

సాక్షి, పాల్వంచ: మైనారిటీ విద్యార్థినులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2003–04 విద్యా సంవత్సరంలో బేగం హజరత్‌ మహల్‌ జాతీయ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో ఈస్టిండియా కంపెనీపై తిరుగుబాటు చేసి, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బేగం హజరత్‌ మహల్‌ పేరుతో కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 9, 10, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ తరగతుల విద్యార్థినుల కోసం రూపొందించిన ఈ స్కీం అమల్లోకి వచ్చి 16 సంవత్సరాలు దాటినా.. సరైన ప్రచారం లేకపోవడంతో జిల్లాలో ఇంతవరకు ఒక్క విద్యార్థిని కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ పథకం గురించి ప్రచారం కల్పించడంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో అర్హులు సుమారు 14వేల మంది.. 
మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, పార్శీ మతాలకు చెందిన 9, 10 తరగతుల పేద విద్యార్థినులకు సంవత్సరానికి రూ. 5వేలు, ఇంటర్‌ విద్యార్థినులకు రూ.6 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు. జిల్లాలో 9,10 తరగతుల విద్యార్థినులు సుమారు 5 వేల మంది, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన వారు 9 వేల మంది ఉన్నారు. అయితే ఈ పథకం గురించి ప్రచారం చేసే నాథుడు లేకపోవడంతో ఇంతవరకు ఒక్క విద్యార్థిని కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఎంతోమంది అర్హులైన పేద విద్యార్థినులు నష్టపోతున్నారు. అసలు ఈ పథకం గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు కూడా రాలేదు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు... 
బేగం హజరత్‌ మహల్‌ జాతీయ స్కాలర్‌ షిప్‌ పథకానికి అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉపకార వేతనం పొందాలంటే ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉన్నట్టుగా తహశీల్దార్‌ కార్యాలయం నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, గత సంవత్సరం పొందిన మార్కుల జాబితా, విద్యార్థిని బ్యాంక్‌ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్,  ఫీజు రిసిప్ట్, తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, కులం, చిరునామా, స్కూల్‌ పేరు, మొబైల్‌ నంబర్ల వివరాలు తెలియజేస్తూ ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

మాకు మార్గదర్శకాలు అందలేదు 
బేగం హజరత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి సంబంధించి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వస్తే జిల్లాలో ఈ పథకం గురించి ప్రచారం కల్పిస్తాం.  – జి.ముత్యం, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి

రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయాలి 
మైనార్టీ విద్యార్థినుల కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న  బేగం హజరత్‌ మహల్‌ జాతీయ ఉపకార వేతనాల పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం బాధాకరం. పథకానికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర మైనార్టీ శాఖ జిల్లా అధికారులకు అందించాలి. ఈ పథకం గురించి ప్రచారం కల్పించాలి. మా సంస్థ తరఫున కూడా జిల్లాలో ప్రచారం చేస్తాం.  
– ఎం.డి.యాకూబ్‌పాషా, మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top