శాంతి భద్రతలు అదుపు తప్పాయి : భట్టి 

Batti Vikramarka Comments About Law And Order In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని, పోలీసు యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక్క హైదరాబాద్‌లోనే రెండేళ్లలో వేలమంది అమ్మాయిల మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయని, రోజుకు ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భట్టి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరిగింది.

ఈ సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. దిశ ఘటన తమను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆసిఫాబాద్, వరంగల్‌లో మహిళలపై జరిగిన ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులకు ఉరిశిక్ష పడాలని అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులకు మద్యమే ప్రధానకారణంగా కనిపిస్తోందన్నారు.  

మద్యాన్ని నియంత్రించాలి 
మద్యం నియంత్రణ కోసం శనివారం ట్యాంక్‌బండ్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చార్జీల పెంపు పేరుతో ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారో అర్థం కావడం లేదన్నారు. సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), పొడెం వీరయ్య (భద్రాచలం)లు గైర్హాజరయ్యారు. భట్టితో పాటు శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top