బట్టకాల్చి మీదేస్తారా? | Bathukamma Sarees set fire, KTR blames opposition parties | Sakshi
Sakshi News home page

బట్టకాల్చి మీదేస్తారా?

Sep 19 2017 1:46 AM | Updated on Aug 15 2018 8:08 PM

బట్టకాల్చి మీదేస్తారా? - Sakshi

బట్టకాల్చి మీదేస్తారా?

జగిత్యాలలోని ఓ ఊరిలో మహిళలు వెళ్తుంటే చీరలు గుంజుకుని తగలబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి నాయకులు దగ్గరుండి ఈ చీరలు కాల్చారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమంటే అక్షరాల ఇదే.

- మహిళల చేతిలోంచి చీరలను గుంజుకుని తగలబెడతారా?
- ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపాటు
- వారం కిందే దుష్ప్రచారానికి కుట్రపన్నారు
- ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది?
- ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి?
- ప్రభుత్వం చేసే మంచి పనులతో ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయి
- ఆగమాగమై కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు
- కుంభకోణం ఆరోపణలపై ఆధారాలు చూపితే ఏ విచారణకైనా సిద్ధం


సాక్షి, హైదరాబాద్ ‌: ‘‘జగిత్యాలలోని ఓ ఊరిలో మహిళలు వెళ్తుంటే చీరలు గుంజుకుని తగలబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి నాయకులు దగ్గరుండి ఈ చీరలు కాల్చారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమంటే అక్షరాల ఇదే. లేని అపవాదును మీద వేయడానికి ఇలా కుసంస్కారమైన పనులతో తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారు..’’అని చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది.. ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి అని ప్రశ్నించారు.

ఏ మహిళల నుంచి చీరలు లాక్కున్నారో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కాంగ్రెస్‌ సర్పంచ్, ఎంపీటీసీ భర్తలపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంత నీచమైన, హీనమైన రాజకీయం చేస్తారా అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. తప్పులు, లోటుపాట్లు ఉంటే తప్పకుండా సమీక్షించుకుంటామని, 25 లక్షల చీరలు ఒక్కరోజే పంపిణీ చేస్తే అందులో 250 చీరలు బాగా లేకున్నా మొత్తం చీరల్లో అవి కేవలం 0.0001 శాతమేనని అభిప్రాయపడ్డారు. దీనికే కాంగ్రెస్, టీడీపీ గొంతులు చించుకుంటున్నాయని విమర్శించారు.

‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు లాభం చేకూర్చేలా రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఖర్చుతో పెట్టుబడి ఇవ్వబోతున్నాం. 34 లక్షల మంది గొర్ల, కుర్మ సోదరులకు 1.40 కోట్ల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. 2 లక్షల బర్రెలకు సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవన్నీ చూసి విపక్షాల గుండెలు అదిరిపోయి, ఆగమాగమై పోయి కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు. గోరంతలను కొండంతలు చేసే విపక్షాల కార్యక్రమంలో పాల్గొనవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. 8 వేలకుపైగా కేంద్రాల్లో చీరలు పంపిణీ చేస్తే ఐదారు కేంద్రాల్లో జరిగిన గొడవలను భూతద్దంలో చూపి ఆగమాగమై పోవడం ఎంత వరకు మంచిది’’ అని ప్రశ్నించారు.

బతుకమ్మ చీరల పంపిణీపై సోమవారం సాయంత్రం ఆయన సచి వాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏ పని చేసినా, చేయదలుచుకున్నా ఏదో ఒక విధంగా బద్నాం చేసేందుకు దిగజారుడు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. ఇంత నీచనికృష్ట రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం. బతుకమ్మ అనేది ఓ సెంటిమెంట్‌. ప్రపంచంలో ఎక్కడా ఇంత అద్భుతమైన, అపురూపమైన పండుగ ఉండదు. బతుకమ్మ సందర్భంగా పేర్చిన పూలను సైతం చెరువులో  భద్రంగా వేస్తారు. బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వమిచ్చిన చీరలు బాగా లేవని కాల్చడమేంటి? ఇంతకు మించిన దిగజారుడు రాజకీయం చూడలేదు’’అని అన్నారు.

సోమవారం ఉదయం నుంచే కృత్రిమమైన నిరసనలకు శ్రీకారం చుట్టారని, ఉదయం 10 గంటలకే సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభమైందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు ఇంకా స్టాక్‌పాయింట్‌లో ఉండగానే అవి నాసిరకంగా ఉన్నాయని ఓ పత్రికలో వార్త వచ్చిందని, వారం నుంచే ప్రణాళికాబద్ధంగా ఈ దుష్ప్రచారానికి ప్లాన్‌ వేశారన్నారు.  మొదటిరోజు మొత్తం 25 లక్షలకు పైచిలుకు చీరలను పంపిణీ చేశామన్నారు. 1.04 కోట్ల చీరల పంపిణీకి లక్ష్యం పెట్టుకున్నా.. మరో 2 లక్షల చీరలను అదనంగా ఉంచుకొని మొత్తం 1.06 కోట్ల చీరల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్, గంభీరావుపేట మండల కేంద్రాల్లో 4 వేల మహిళలు, చిప్పలపల్లి గ్రామంలో ఐదారు వందల మంది మహిళలకు తానే చీరలు అందజేసి మాట్లాడానని, వారంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ఇరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తే.. నాలుగైదు చోట్లే సంఘటనలు జరిగాయని కేటీఆర్‌ తెలిపారు. ‘‘అందులో కాంగ్రెస్‌ శాసనసభ ఉప నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో మూడు చోట్ల, సత్తుపల్లిలో ఒకచోట నిరసనలు జరగడం వెనుక అర్థమేంటి? ప్రజల కోసం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సిన సంస్కారం, సోయి ప్రతిపక్షాలకు లేదు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ నాయకులకు కోటి మందికి చీరలు పంపిణీ చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా పొరపాటుగానైనా వచ్చిందా? కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి చీరలు ఇచ్చారు. నచ్చకపోయినా మహిళలు చీరలు తగలబెట్టరు. ఇంటికి తీసుకెళ్లి పక్కన పెడ్తారు. లేకుంటే పని మనిషికి ఇస్తారు. ఇంకోటి చేస్తారు తప్ప తగలబెట్టే కుసంస్కారం వారికి ఉండదు.’’అని అన్నారు.

చేనేత, మర నేత, సిరిసిల్ల–పోచంపల్లి చీరల మధ్య తేడా తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే సన్నాసులు ముందు విషయం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల కార్మికుల జీతం రూ.7 వేల నుంచి రూ.20 వేల దాకా పెరిగిందని, ఇది చూసి విపక్షాల కన్ను కుడుతోందన్నారు. చేనేత కార్మికులకు రూ.1,200 కోట్ల బడ్జెట్‌ ఏ ప్రభుత్వం పెట్టలేదన్నారు.

ఏ విచారణకైనా సిద్ధం
సూరత్‌ చీరలు నాసిరకమైతే సిరిసిల్ల చీరలు మంచివని చెప్పవచ్చు కదా అని కేటీఆర్‌ విలేకరులను ప్రశ్నించారు. సమయం సరిపోకపోవడం వల్లే సూరత్‌ నుంచి చీరలు కొన్నామన్నారు. ‘‘ఎంతసేపు నల్ల మచ్చలు చూడటమెందుకు.. తెల్లవి కూడా చూడాలి. చీరలు గుంజుకొని కాల్చితేనే జగిత్యాలలో కేసులయ్యాయి. కాల్చినా తప్పులేదు.. గుంజుకున్నా తప్పులేదు.. గుంజినా తప్పు లేదు.. ఇలా ఏం చేసినా కేసులు పెట్టొద్దంటారా?’’ అని అన్నారు. సూరత్‌ చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని టీడీపీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆధారాలుంటే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని మహిళలపై కేసులు పెట్టినట్టు తన వద్ద సమాచారం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement