ఈ రాముడు..ఏకలవ్యుడు

Bamboo Toys Specialist Ramu Special Story - Sakshi

వెదురుతో బొమ్మల తయారీ  

ప్రతిమల తయారీలోనూ ప్రత్యేకత   

ఐటీడీఏ ద్వారా పనిముట్లు అందించాలని వేడుకోలు

కంక బొంగులకు ప్రాణం పోస్తే.. సిమెంటు, ఇసుకకు ఓ ఆకృతినిస్తే.. బొమ్మలు మాట్లాడుతాయి.. ప్రతిమలు మనుసులను ఆకర్షిస్తాయి. ఏకలవ్యుడి చేతిలో ప్రాణం పోసుకున్న కళాకృతుల్ని చూస్తే అబ్బా ఏం కళ అనకుండా ఉండరంటే నమ్మండి. అంత కళ ఉన్నప్పటికీ కొలాం గిరిజన యువకుడికి తగిన ప్రోత్సాహం లభించట్లేదు. తగిన ప్రోత్సామందిస్తే మరింతమందికి ఉపాధి కల్పిస్తానని ఆ యువకుడు పేర్కొంటున్నాడు.

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): నార్నూర్‌ మండలం ఖైర్‌డట్వా గ్రామ పంచాయతీ పరిధిలోని నడ్డంగూడ గ్రామానికి చెందిన మాడవి రాము అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాము పదో తరగతి వరకు నార్నూర్‌ మండలంలోనే అభ్యసించాడు. అనంతరం ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యను అభ్యసించలేదు. తల్లిదండ్రులతో అడవికి వెళ్లి వెదురు తెచ్చుకుని వారు తయారు చేసే చాపలు, బుట్టలు, తడకలు తదితర రూపాలను రాము సైతం నేర్చుకున్నాడు. 

ప్రతిభ బయటికొచ్చిందిలా..
కొన్నేళ్ల క్రితం పొలాల అమావాస్య నాడు ఎడ్ల పూజలకు రకరకాల అలంకార వస్తువులను రాము తల్లిదండ్రులు తీసుకువచ్చారు. ఆ కాగితాలు, దేవుళ్ల చిత్రాలను రాము అందంగా తయారు చేశాడు. అదే సమయంలో కట్టెలతో తయారు చేసిన ఎడ్ల జత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని దేవాలయంలో తాను తయారు చేసిన ఎడ్ల జతను దేవాలయంలో ప్రదర్శనకు ఉంచాడు. అంతే కాకుండా దేవాలయంలోని గోడలపై వివిధ బొమ్మలు వేశాడు. అతడి ప్రతిభ గుర్తించిన ఇరుగు పొరుగు తమ ఇళ్లకు కూడా బొమ్మలు వేయాలని ఆఫర్‌ ఇచ్చారు. ఆ రోజు నుంచే తన జీవితం మారిపోయిందని రాము చెప్పకొస్తున్నాడు. మరుసటి రోజు నుంచే అలా ఇళ్ల గోడలపై బొమ్మలు వేయడం ప్రారంభించానని, భరతమాత, గాంధీజీ, అంబేద్కర్, బుద్ధుడు, శ్రీరాముడు, బాలాజీ, శివుడు ఇలా చిత్రాలు వేసి రోజుకు రూ. 500 చొప్పున కూలీ సంపాదించానని రాము చెబుతున్నాడు.

విగ్రహాల తయారీతో ఉపాధి..
రాముకు ఒక ఆలోచన రావడంతో సుత్తితో హనుమంతుడిని చిన్న ప్రతిమ చెక్కడం మొదలు పెట్టాడు. దాన్ని చూసిన ఖండోరాంపూర్‌ గ్రామానికి చెందిన నాగోరావు అనే రేషన్‌ డీలర్‌ మాకు సంత్‌ తుక్డోజీ మహారాజ్, గాంధీజీ విగ్రహాలు కావాలని కోరడంతో సిమెంట్, కాంక్రిట్, ఇనుప చువ్వలతో రెండు విగ్రహాలను తయారు చేసి రాము రూ, 10 వేలు పారితోషికం పొందాడు. అప్పటి నుంచి రాము ప్రతిమల్ని తయారు చేయడం ప్రారంభించాడు. తాను ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండా ఏకలవ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అర్డర్లు చాలానే వస్తున్నాయని, కొన్ని విగ్రహాలకు కావాల్సిన పని ముట్లు, మిషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాము పేర్కొంటున్నాడు.

వెదురుతో క్రాప్ట్‌:నడ్డంగూడ గ్రామానికి చెందిన వికలాంగుడు ఆత్రం జలపత్‌రావు సహాయంతో రాము వెదురుతో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇంట్లో వాడే దగ్గరి నుంచి కూర్చీలు వరకు వెదురుతో తయారు చేసి అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు. ఆయన దగ్గర ఎలాంటి సామగ్రి లేకున్న సొంత తెలివితేటలతో వస్తువులను తయారు చేస్తున్నాడు. వెదురుతో ఎడ్ల బండి, ఎద్దులు, తాజ్‌మహాల్, స్టాండ్‌లు, బొమ్మలు, సెల్‌ఫోన్‌ స్టాండ్‌లు తదితర వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని ఆదిలాబాద్‌ లేదా హైదరబాద్‌ తీసుకెళ్లి అమ్ముతున్నారు. వసువులు తయారీకై ఎలాంటి పనిముట్లు తమ వద్ద లేవని, ఐటీడీఏ ద్వారా సామగ్రిని అందజేస్తే మరింత మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన అంటున్నారు. ఐటీడీఏ అధికారులతో పాటు కలెక్టర్‌ స్పందించి కొలాం గిరిజనులను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు.

యువతకు నేర్పిస్తా
నేను స్యయంగా నేర్చుకుని శిల్పా కళతో కుటుంబాన్ని పోషిస్తున్నా. శిల్పాలను సుత్తితో చెక్కడం చాలా కష్టంగా ఉంది. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే మిషన్లు కొనుక్కుని తక్కువ సమయంలో అందమైన శిల్పాలను చెక్కుతా. నేను ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తా.– మాడవి రాము, నడ్డంగూడ, నార్నూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top