హారిక, రాము దంపతులపై.. పక్కా పథకం ప్రకారమే దాడి | YSRCP ZP chairpersons and chairmen with the media | Sakshi
Sakshi News home page

హారిక, రాము దంపతులపై.. పక్కా పథకం ప్రకారమే దాడి

Jul 17 2025 5:16 AM | Updated on Jul 17 2025 5:16 AM

 YSRCP ZP chairpersons and chairmen with the media

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే జెడ్పీ చైర్మన్ల గన్‌మెన్లను తొలగించారు

జిల్లా ప్రథమ పౌరురాలిపై దాడి దుర్మార్గం

పోలీసులు దగ్గరుండి చేయించినట్లుగా మేం భావిస్తున్నాం

న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలి

మీడియాతో వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్‌పర్సన్లు, చైర్మన్లు

పెడన: పోలీసుల సమక్షంలోనే టీడీపీ, జనసేన గూండాలు పథకం ప్రకారమే ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, రాము దంపతులపై దాడిచేశారని.. ఇది వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్‌పర్సన్లు, చైర్మన్లు చెప్పారు. కృష్ణాజిల్లా పెడన మండలం కూడూరు పంచాయతీ కృష్ణాపురంలోని హారిక, రాముల నివాసానికి బుధవారం వారు వచ్చారు. హారిక, రాములను పరామర్శించి దాడిని ఖండించారు. 

జెడ్పీచైర్‌పర్సన్లు బూచేపల్లి వెంకాయమ్మ (ప్రకాశం), ముచ్చర్ల రామగోవిందరెడ్డి (కడప), విప్పర్తి వేణుగోపాలరావు (ఉమ్మడి తూర్పు గోదావరి), ఆనం రమణమ్మ (ఉమ్మడి నెల్లూరు), యర్రపోతు పాపిరెడ్డి (ఉమ్మడి కర్నూలు జిల్లా), జల్లేపల్లి సుభద్ర (ఉమ్మడి విశాఖ), మజ్జి శ్రీనివాసరావు (ఉమ్మడి విజయనగరం), పిరియా విజయ (శ్రీకాకుళం), జి. శ్రీనివాసులు (చిత్తూరు), బోయ గిరిజ (ఉమ్మడి అనంతపురం), ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తదితరులు హారిక దంపతులను పరామర్శించారు. అనంతరం పలువురు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..  

న్యాయస్థానాలు దృష్టిసారించాలి..
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజే జెడ్పీ చైర్‌పర్సన్లకు గన్‌మెన్‌లను తొలగించారు. ఇలా దాడులు చేయించడానికే మాకు గన్‌మెన్లను ఇవ్వడంలేదనే విషయం ఆర్థమవుతోంది. న్యాయస్థానాలు ఈ విషయంపై దృష్టిసారించాలి. పోలీస్‌ వ్యవస్థ ఉండి కూడా హారికపై దాడి దారుణం.  – జల్లేపల్లి సుభద్ర, జెడ్పీ చైర్‌పర్సన్, ఉమ్మడి విశాఖ జిల్లా

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
జిల్లా ప్రథమ పౌరురాలు పార్టీ సమావేశానికి వెళ్తే టీడీపీ, జనసేన గూండాలు పోలీసుల సమక్షంలో దాడిచేయడం ఏమిటి? తిరిగి బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం దుర్మార్గం. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? రాష్ట్రానికి హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు. సాటి మహిళపై జరిగిన దాడిని ఖండించలేకపోయారు.  – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి విజయనగరం జిల్లా 

పోలీసులు ఉండి ఉపయోగం ఏమిటి? 
హారిక, రాము దంపతులపై దాడిచేసిన వీడియోలు చూస్తుంటే పోలీసులు ఉండి ఏం చేస్తున్నారో అర్థంకావడంలేదు. ప్రజాప్రతినిధులకు, సామాన్యులకు రక్షణ కల్పించడం మానేసి గూండాలకు, అల్లరిమూకలకురక్షణ కల్పించేలా పోలీసులు నడుచుకోవడం అన్యాయం. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేసి దాడులు చేయిస్తోంది. హారికకు పార్టీ, మేము అండగా ఉంటాం. – పిరియా విజయ, శ్రీకాకుళం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ 

ఉగ్రవాద రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? 
ఉగ్రవాద రాజ్యంలో ఉన్నామా? బీసీ మహిళపై దాడి జరిగితే పట్టించుకోరా? హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవాలి. హారిక, రాముకు న్యాయం చేయాలని హైకోర్టును కోరుతున్నాం. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తాం.  – జి. శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్, చిత్తూరు జిల్లా 

బీసీలను కించపరిచిన చరిత్ర బాబుది.. 
గంటన్నర పాటు హారిక కారును కదలనీయకుండా నిర్బంధించి దాడిచేశారు. బీసీ మహిళలు రాజకీయంగా ఎదగకుండా చేయాలనే ఇలా చేస్తున్నారు. బీసీలను కించపరిచిన చరిత్ర చంద్రబాబుది. ఈ కేసును సుమోటోగా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలను కోరుతున్నాం.  – బోయ గిరిజ, జెడ్పీ చైర్‌పర్సన్, ఉమ్మడి అనంతపురం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement