ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ 

B Tech Student Committed Suicide Due To Online Gaming At Mancherial - Sakshi

బెట్టింగ్‌లతో రూ. 15 లక్షల అప్పు

మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య 

లక్సెట్టిపేట (మంచిర్యాల): మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఓ బీటెక్‌ విద్యార్థి జీవితం బలైంది. చిన్నచిన్న గేమ్స్‌తో మొదలైన ఆకర్షణ.. బెట్టింగ్‌వరకూ వెళ్లి అప్పుల పాలు చేసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలవడంతో వారు అప్పులు తీర్చినప్పటికీ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో శనివారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఏఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్‌ కుమారుడు మధుకర్‌ (24) హైద రాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసయ్యాడు. తన మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ బెట్టింగ్‌ కాయడంతో తీవ్రంగా నష్టపోయా డు. ఇలా తెలిసినవారి వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విష యం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించి.. అప్పులన్నీ తీర్చా రు. అయితే తాను చేసిన అప్పులకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని ఆవేదనకు గురైన మధుకర్‌ ఈనెల 7న ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంచిర్యాలలో క్రిమిసంహారక మందు తాగి తన అక్కకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. వారు అక్కడున్న స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top