చ్యవన్‌ప్రాశ్‌ తినండి.. తులసి టీ తాగండి

Ayush Ayurvedic Guidelines For Immunity Enhancement - Sakshi

రోజువారీ వంటకాల్లో జీరా, వెల్లుల్లి, ధనియాలు తప్పక వాడాలి

రోజూ ఒకటీ– రెండుసార్లు కొబ్బరి/నువ్వుల నూనెతో పుక్కిలింత

రోగనిరోధక శక్తి పెంపునకు ఆయుష్‌ ఆయుర్వేద మార్గదర్శకాలు

విద్యార్థులకు తెలియజేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో శరీర సహజ రక్షణ వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ప్రకృతిసిద్ధమైన ఆయుర్వేదం అందుకు దోహదపడుతుంద’ని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకోసం రోజువారీ వంటకాల్లో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పసుపు క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించింది. రోగ నిరోధకశక్తిని పెంచే వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలుపుతూ ఈ ఆయుర్వేద మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ సూచనలను జిల్లాల అధికారులకు పంపింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు వీటిని పాటించాలని పేర్కొంది. ఆరోగ్యం కోసం ‘ఆయుష్‌’ సూచిస్తోన్న ఆయుర్వేద సూత్రాలివే..

శరీర సహజ రక్షణ వ్యవస్థ కోసం..
► గోరువెచ్చని నీటినే తాగాలి. రోజులో ఏ సమయంలోనైనా అవే తాగాలి.
► రోజూ అరగంట పాటు యోగా, ప్రా ణాయామం, ధ్యానం చేయాలి.
► వంటకాల్లో కచ్చితంగా పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వినియోగించాలి. వీటి వినియోగం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఇవి తినండి.. ఆరోగ్యంగా ఉండండి
► విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన బలవర్ధక ఆహారం తీసుకోవాలి.
► క్యారెట్, ఆకుకూరలు, కీరా, పండ్లు, కర్బూజ తగినంతగా తీసుకోవాలి. 
► ద్రాక్ష, కివీ, కమలాలు, చేపలు, గుడ్లు, పాలు, సోయా, శనగలు, చిక్కుడు గింజలు వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

రోగనిరోధక శక్తి కోసం..
► రోజూ ఉదయమే పది గ్రాముల (ఒక స్పూన్‌) చ్యవన్‌ప్రాశ్‌ తీసుకోవాలి.
► హెర్బల్‌ టీ తాగాలి. లేదా తులసి/దాల్చిన చెక్క/ నల్ల మిరియాలు (బ్లాక్‌ పెప్పర్‌) శొంఠి వేసిన డికాషన్‌ తాగాలి. రుచి కోసం అందులో బెల్లం, నిమ్మరసం వేసుకోవచ్చు. రోజులో ఒకటి– రెండుసార్లు ఎండు ద్రాక్ష తినాలి.
► 150 మిల్లీలీటర్ల వేడి పాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకొని రోజులో ఒకటీ రెండుసార్లు తాగాలి.

ఇలా చేస్తే ఆరోగ్యభాగ్యం
► నువ్వుల లేదా కొబ్బరినూనె లేదా నెయ్యి చుక్కలు రోజూ ఉదయం, సాయంత్రం ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.
► నువ్వుల లేదా కొబ్బరి నూనె ఒక స్పూన్‌ మేర నోట్లో వేసుకోవాలి. 2 – 3 నిమిషాల పాటు దాన్ని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా నిత్యం ఒకటీ రెండుసార్లు చేయాలి.
► గొంతుమంట, పొడి దగ్గు ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. సాధారణ ఉపశమనం కోసం పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకోవాలి. బెల్లం లేదా తేనెతో లవంగాల పౌడర్‌ కలుపుకొని రోజూ రెండుసార్లు తాగాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top