ఆపద్బాంధవుడు హనీఫ్‌..

Auto Driver Haneef Free Auto Ride For Accident Casualties - Sakshi

మానవత్వానికిచిరునామాగా ఓ ఆటో డ్రైవర్‌  

క్షతగాత్రులను ఉచితంగా ఆస్పత్రులకు చేరవేత   

ముదిమిలోనూ విరామమెరగనిసేవా తత్పరత

ప్రధాని మోదీ నినాదమే స్ఫూర్తినిచ్చిందని వెల్లడి

తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించాలని తలపెట్టారాయన. పేదల సేవలో నేను సైతం అంటూ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారాయన. వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవితాన్నే సేవా తత్పరతకు అంకితం చేశారు. మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు 84 ఏళ్ల మహ్మద్‌ హనీఫ్‌ సాహెబ్‌. మానవతకు మారుపేరుగా. మంచితనానికి మరోరూపుగా.. కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న హనీఫ్‌సేవాగుణంపై కథనం ఇదీ..      

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లోని జహీరానగర్‌లో నివసించే హనీఫ్‌కు ఆరుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. 50 ఏళ్లుగా ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాను సంపాదించినదానికి కొంత సార్థకత చేకూరాలనే ఉద్దేశంతో తలంచారు. కష్టాల్లో ఉన్నవారికి  20 ఏళ్లుగా తన ఆటో ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని బాలింతలు, గర్భిణులు, ఆస్పత్రులకు వెళ్లే వృద్ధులు ఫోన్‌ చేస్తే చాలు.. తాను కళ్లారా చూస్తే చాలు వారిని తన ఆటోలో ఎక్కించుకొని ఆస్పత్రులకు కిరాయి డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా చేరువేస్తున్నారు. ప్రతినిత్యం కనీసం 10 మందినైనా ఆస్పత్రులకు చేరుస్తుంటానని హనీఫ్‌ తెలిపారు. ఇలా చేయడంలో తనకెంతో ఆనందం ఉందని, తన కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తారు తప్పితే ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ నినాదానికి ప్రభావితమయ్యాయనన్నారు. తన ఫోన్‌ నంబర్, ఇతర వివరాలను ఆటోపై రాసి ఓ బోర్డు ఏర్పాటు చేసుకొని ఉచిత సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పట్టపగలు.. అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు ఆయన. ప్రమాదం జరిగినప్పుడు పలువురు తనకు ఫోన్‌ చేసి పిలుస్తాంటారని వెల్లడించారు.  

సైకిల్‌పై హజ్‌ యాత్ర.. 
2006లో హనీఫ్‌ సైకిల్‌పై మక్కా యాత్ర చేపట్టారు. 2006 ఆగస్ట్‌ 7న నాంపల్లి హజ్‌భవన్‌ నుంచి ప్రారంభమైన సైకిల్‌ యాత్ర తొమ్మిది నెలల తర్వాత 2007లో మక్కాకు చేరుకుంది. ఏడు రాష్ట్రాలు, ఏడు దేశాలు దాటుకొని ఆయన మక్కా చేరుకున్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వద్దకు వెళ్లి తను మక్కా వెళ్లేందుకు సైకిల్‌ యాత్ర కోసం అనుమతిప్పించాల్సిందిగా కోరారు. ఇందుకోసం ప్రస్తుత
సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అప్పట్లోనే తనకు అనుమతులు ఇప్పించారని గుర్తు చేసుకున్నారు హనీఫ్‌. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సైకిల్‌ యాత్రకు అనుమతివ్వడానికి సతాయించగా బీజేపీ నేతలు మాత్రం దగ్గరుండి తనకు అనుమతులు ఇప్పించారని వారి మేలు మర్చిపోలేనిదన్నారు.  

నెలకు రూ.30 వేల ఆర్జన..
తాను స్కూల్‌ పిల్లలను ప్రతిరోజూగచ్చిబౌలి నాసర్‌ స్కూల్‌కు తీసుకెళ్లి మళ్లీ గమ్య స్థానాలకు చేర్చేందుకు నెలకు రూ.21 వేలు సంపాదిస్తానన్నారు. మిగతా సమయంలో మరో రూ.9 వేల దాకా వస్తుందన్నారు. రూ.30 వేలు జీవనోపాధికి సరిపోతాయని ఉచితంగా సేవలు అందించేందుకు మహా అంటే నెలకు రూ.5 వేలు ఖర్చవుతుందని, ఈ రూ.30 వేల నుంచే ఆ ఖర్చులు తీసేసుకుంటానని వెల్లడించారు. ఎవరు, ఎప్పుడు ఫోన్‌ చేసినా తనకు శక్తి ఉన్నంత వరకుఈ సేవలు కొనసాగుతాయనిస్పష్టంచేశారు.   

ఆపదలో ఉంటే ఫోన్‌ చేయొచ్చు..  
ఎవరైనా ఆపదలో ఉంటే, ప్రమాదంలో గాయపడి ఆటో దొరక్క ఇబ్బంది పడితే 76808 58966 నంబర్‌లో సంప్రదించవచ్చని హనీఫ్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top