ఒక్క క్షణం ఆగండి..

Attention drivers Turn off your idling engines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క క్షణం ఆగండి. మీ బండి ఇంజన్‌ ఆపేయండి. మరో 2 కిలోమీటర్‌లు అదనంగా ప్రయాణం చేయండి. ఇం‘ధనం’ ఆదా చేసుకోండి. నిజమే నగరంలో ట్రాఫిక్‌ రద్దీ కారణంగా పెట్రోల్, డీజిల్‌ భారీగా దుర్వినియోగమవుతున్నాయి. సిగ్నల్‌ పడిన వెంటనే ఇంజన్‌ ఆఫ్‌ చేయకపోవడం వల్ల ప్రతి రోజు వేలాది లీటర్ల  ఇంధనం అనవసరంగా  ఖర్చవుతోంది. అంతేకాదు. ప్రమాదకరమైన  కాలుష్య ఉద్గారాలు నగర పర్యావరణానికి ముప్పుగా  మారుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు  పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే  సిగ్నల్‌ పడిన వెంటనే  ఇంజన్‌ ఆఫ్‌ చేస్తే చాలు. కనీసం  50 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల  వరకు పెట్రోల్, డీజిల్‌ ఆదా అవుతుంది. ఏసీ  వాహనాల్లో అయితే  200 ఎం.ఎల్‌ వరకు కూడా ఇంధనాన్ని మిగుల్చుకోవచ్చు.  

అంతేకాదు, ఒక లీటర్‌ పెట్రోల్‌ పైన  60  కిలోమీటర్లు  వెళ్లే  బైక్‌ మరో 2  కిలోమీటర్లు అదనంగా  ముందుకు  వెళ్తుంది. ఒక లీటర్‌  డీజిల్‌పైన  కనీసం  10 నుంచి  15  కిలోమీటర్‌లు నడిచే   కారు  మరో  కిలోమీటర్‌ అదనంగా  ముందుకు నడుస్తుంది.ఒక్క సిగ్నల్‌ వద్ద  ఇంజన్‌ ఆఫ్‌ చేయడం వల్ల  1 నుంచి  2 కిలోమీటర్ల అదనపు  ప్రయోజనం లభిస్తుంది. ఒక్కసారి బండి బయటకు తీస్తే  కనీసం  4 నుంచి 6 సార్లయినా సిగ్నల్‌ వద్ద  బ్రేకులు పడుతాయి. ఆ సమయంలో  ఇంజన్‌ ఆఫ్‌ చేస్తే అదనంగా  10 కిలోమీటర్‌ల ప్రయాణం కలిసి వస్తుంది. కార్లు, ఇతర వాహనాలు సైతం  సిగ్నల్స్‌ వద్ద  ఇంజన్‌ను ఆపేయడం వల్ల   రోజుకు  250 ఎంఎల్‌ నుంచి  300ఎంఎల్‌ వరకు ఆదా చేసేందుకు అవకాశంఉంటుంది. ఇంధనం పొదుపు చేయడం వల్ల  దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా వాహనాల సామర్ధ్యం కూడా పెరుగుతుంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top