ఆధార్‌ నోటీసులపై అసదుద్దీన్‌ ఫైర్‌..

Asaduddin Owaisi Slams Aadhaar Notices To Hyderabadis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేయడంపై  ఏఐఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉడాయ్‌, తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. ఉడాయ్‌ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఆధార్‌ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.

కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ చూపమని అడగటం విరమించుకోవాలని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్‌ ట్వీట్‌ చేశారు. నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్‌ సస్పెండ్‌ చేయాలని మరో పోస్టులో ఆయన కోరారు. కాగా 127 మందికి నోటీసులు జారీ చేసిన ఉడాయ్‌ అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని వారిని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

చదవండి : హైదరాబాద్‌లో 127మందికి ఆధార్‌ నోటీసులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top