
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులను కూడా కొనసాగించరాదని, పనులన్నింటినీ వెంటనే నిలిపేయాలంటూ ఈ నెల 5న ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఉత్తర్వుల వల్ల రోజుకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందంటూ ప్రభుత్వం, నీటిపారుదలశాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఎన్‌జీటీలో ఫిర్యాదు చేసిన హయత్ ఉద్దీన్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ శుక్రవారం వాదనలు కొనసాగిస్తూ, తాము దాఖలు చేసిన ఫిర్యాదును విచారించే పరిధి ఢిల్లీలోని ఎన్‌జీటీకి ఉందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, చెన్నైలో ఉన్న ఎన్‌జీటీ ధర్మాసనానికే విచారణార్హత ఉందని తెలిపారు. డిజైన్ మారినంత మాత్రాన కొత్త ప్రాజెక్ట్ అనడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.