సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం

Antibody Test Ready For Coronavirus - Sakshi

కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం పీసీఆర్‌ ఆర్‌సీటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొంతు, ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల్లో వైరస్‌ తాలూకు డీఎన్‌ఏ పోగులను గుర్తించడం ఈ పరీక్షల పద్ధతి. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పరీక్షల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైలీ అనే సంస్థ యాంటీబాడీ పరీక్ష ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని గుర్తించడం వీలవుతుండగా యాంటీబాడీ లేదా రక్త పరీక్షలు తొలిదశలోనే వైరస్‌ను గుర్తించగలవు. అంతేకాకుండా వైరస్‌ ఎంతమేరకు విస్తరించింది, ఒక్కో వ్యక్తి యాంటీబాడీ ప్రతిస్పందన ఎలా ఉంది? మరోసారి వైరస్‌ బారిన పడకుండా ఉండగలిగే సామర్థ్యం ఎందరికి ఉంది? అన్నది ఈ కొత్త యాంటీబాడీ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

కరోనా వైరస్‌లోని కీలకమైన ప్రొటీన్‌ భాగాలను ఉపయోగించడం ద్వారా వైరస్‌ను అడ్డుకునేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసిన యాంటీబాడీలను గుర్తించడం ఈ కొత్త పరీక్ష పద్ధతి విశేషం. లక్షణాలు లేని వారితోపాటు, కొద్దిపాటి తీవ్రత ఉన్నవారిలోనూ వైరస్‌ వ్యాప్తి ఎంతనేది ఈ పరీక్షల్లో స్పష్టంగా తెలుస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌ను తట్టుకోగల రోగ నిరోధకశక్తి ఉన్న వ్యక్తులను గుర్తించడం కూడా ఈ పరీక్ష ద్వారా సాధ్యమవుతుంది. దీనివల్ల కరోనా వైరస్‌ సోకని వ్యక్తులనే రోగుల చికిత్సలో ఉపయోగించవచ్చు. తద్వారా వైరస్‌ ఇతరులకు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ కొత్త పరీక్ష ఎలా నిర్వహించాలనేది కరెంట్‌ ప్రొటోకాల్స్‌ ఇన్‌ మైక్రోబయాలజీలో విశదీకరించారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ఊపు
కరోనా నేపథ్యంలో ఐటీతోపాటు ఇతర ఉద్యోగాల్లోనూ ఇంటి నుంచే పనిచేయడమనే సంస్కృతి రానుంది. ఇప్పటివరకూ ఉద్యోగులు కంపెనీల ఐటీ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుని పనులు చేస్తుంటే.. ఇప్పుడు ఇళ్లలోని ఇంటర్నెట్‌ కనెక్షన్లను వాడాలి. దీంతో బ్యాండ్‌విడ్త్‌ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వైఫై ప్రొటోకాల్‌ అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. ఇది అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్‌పై బోలెడన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను జోడించుకుని నడిపించవచ్చు. ఇంట్లోని వారంతా హైస్పీడ్‌ వీడియోగేమ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్‌లు వాడుతున్నా ఇంటర్నెట్‌ వేగం ఏమాత్రం తగ్గదన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వైఫై ప్రొటోకాల్‌ను వాడుకోగల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వైఫైతో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, ఆన్‌లైన్‌ క్లాసుల వంటివి బ్యాండ్‌విడ్త్‌ సాఫీగా నడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top