యాంటీ‘భయో’టిక్స్‌

Anti Biotics do not working on Virus - Sakshi

సూక్ష్మక్రిములపై పనిచేయని మందులు

ఫలితంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది మృతి

2050 నాటికి ఏటా కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

భారత్‌లో అప్పటికి ఏటా 15 లక్షల మందికిపైగా మృత్యువాత పడతారని అంచనా

వ్యవసాయంలో పురుగుమందులు, పశువులకు యాంటీ బయోటిక్స్‌తోనూ అనర్థం

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం... విచ్చలవిడి వాడకంపై నిఘా  

సాక్షి, హైదరాబాద్‌: కాయిల్స్‌ వెలిగించినా దోమలు వచ్చి దాని చుట్టూ ఎగురుతుంటే ఏమంటాం? దోమలకు కాయిల్స్‌ను తట్టుకునే శక్తి వచ్చిందనుకుంటాం. అంటే దోమల నివారణకు వాడే కాయిల్స్‌ పనిచేయడంలేదన్న మాట. అలాగే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు కూడా యాంటీ బయోటిక్స్‌ మందులను తట్టుకునే శక్తి వచ్చేసింది. దీంతో జబ్బులు నయం కాకుండా పోతున్నాయి. అలా ఎన్ని యాంటీ బయోటిక్స్‌ మందులు వాడినా తట్టుకొని నిలబడే సూక్ష్మక్రిముల వల్ల జబ్బులు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మంది చనిపోతున్నారు.

ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెలువరించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రతీ ఏడాది కోటి మంది చనిపోతారని హెచ్చరించింది. అంతేకాదు 2030 నాటికి యాంటీ బయోటిక్‌ పనిచేయని పరిస్థితి ఏర్పడటం, కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోవడం తదితర కారణాలతో 2.40 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోతారని పేర్కొంది. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ వాడకంలో వివిధ దేశాలతోపాటు భారత్‌ కూడా ముందుంది. ఇక్కడ ఏటా లక్ష మంది వరకు చనిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు.

2050 నాటికి మన దేశంలో 15 లక్షల మంది ఈ కారణంగా చనిపోతారని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదికను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక మెడికల్‌ ప్రాక్టీషనర్లు విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్‌ మందులను ఇస్తున్నారని, అవి పనిచేయని పరిస్థితులు ఏర్పడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు.  

చిన్నచిన్న జబ్బులకు అధిక డోస్‌..  
నానాటికీ సూక్ష్మక్రిములు యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకుని మొండిగా తయారవుతుండటంతో ఇప్పుడు చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పనిచేయకుండా పోతున్నాయి. చిన్నా చితకా జబ్బులకు కూడా మందుల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. క్షయ, మలేరియా, గనేరియా, న్యూమోనియా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వంటి సర్వసాధారణ వ్యాధులు కూడా పెను సమస్యలుగా పరిణమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. దీనివల్ల వైద్యులు ఎప్పుడో చిట్టచివరి అస్త్రంగా వాడాల్సిన యాంటీ బయోటిక్‌ మందులను తొలి దశలోనే వాడేయాల్సి వస్తుంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చినా ఇప్పుడు యాంటీ బయోటిక్స్‌ వాడటం సాధారణమై పోయింది. సాధారణ మందులతో తగ్గే అవకాశమున్నా త్వరగా కోలుకోవాలన్న ఆతృతతో బాధితులు కూడా వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. వైద్యులు కూడా వాటినే వాడేలా ఒత్తిడి చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం పెన్సిలిన్‌ అనే యాంటీ బయోటిక్స్‌ వేస్తే ఎటువంటి మొండి జబ్బు అయినా ఇట్టే తగ్గేది. కానీ అవి ఇప్పుడు పనిచేయడంలేదు. ఆ తరువాత అధిక డోస్‌ కలిగిన యాంటీ బయోటిక్స్‌ మార్కెట్లోకి వచ్చాయి.

ఈ పరిస్థితి ప్రపంచానికే సవాల్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మక్రిములు మన యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకుంటూ పోతే మున్ముందు చిన్నచిన్న గొంతు ఇన్ఫెక్షన్లు, చిన్నపాటి దెబ్బల వంటివి కూడా ప్రాణాలను కబలించడం ఖాయం. తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం దాదాపు 25 వేల మెడికల్‌ షాపులున్నాయి. గ్రామాల్లో అనర్హులైన అనేకమంది మెడికల్‌ ప్రాక్టీషనర్లూ ఉన్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్‌ ఇవ్వడంతో అవి పనిచేయక జబ్బులు ముదురుతున్నాయి. పైగా వైద్యుల ప్రిస్కిప్షన్‌ లేకపోయినా మందుల దుకాణాలు యాంటీ బయోటిక్స్‌ మందులను ఇచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

పురుగుమందుల వాడకం.. 
వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను చల్లుతున్నారు. కూరగాయలు, ధాన్యపు గింజలకూ వాడేస్తున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తిన్నాక మనుషుల్లోనూ వాటి ఆనవాళ్లు ఉండిపోతున్నాయి. దీంతో ఏదైనా జబ్బు వస్తే యాంటీ బయోటిక్స్‌ పనిచేసే పరిస్థితి ఉండటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. దీనివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గేదెలు అధికంగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో యాంటీబయోటిక్స్‌ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కోళ్లకూ వాడుతున్నారు. తద్వారా పాల ఉత్పత్తులు వినియోగించడం, చికెన్‌ తినడం వల్ల మనుషుల్లోనూ ఈ సూక్ష్మక్రిములు చేరుతున్నాయి. ఇది మానవాళికి ప్రమాదకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక నేపథ్యంలో తెలంగాణలోనూ నిఘా ఏర్పాటుపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారిస్తుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మన దేశంలో గుర్తించిన సమస్యలు
- యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా అమ్మేయడం, అవసరం లేకున్నా వాడేయడం 
వేగంగా కోలుకోవాలని, తక్కువ ఖర్చులో రోగం నయం అయిపోవాలని తాపత్రయపడడం 
​​​​​​​- పశువులకు ఉద్దేశించిన యాంటీ బయోటిక్స్‌ కూడా తేలికగా దొరకడం 
​​​​​​​- వైద్యుల ప్రిస్కిప్షన్‌ లేకుండా ఇవ్వకూడని యాంటీ బయోటిక్‌ మందులు మెడికల్‌ షాపుల్లో సులభంగా లభించడం 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలు... 
​​​​​​​- యాంటీ బయోటిక్స్‌ వాడకం తగ్గించేందుకు ఆయా దేశాల్లో జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అందుకు అవసరమైన నిధులను కేటాయించాలి.  
​​​​​​​- యాంటీ బయోటిక్స్‌ వాడకాన్ని తగ్గించేందుకు, వ్యవసాయంలో పురుగు మందులను, పశువులకు ఇష్టారాజ్యంగా ప్రేరేపిత యాంటీ బయోటిక్స్‌ వాడకుండా చూసేందుకు ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.  
​​​​​​​- యాంటీ బయోటిక్స్‌ను తట్టుకొని నిలబడుతున్న సూక్ష్మక్రిములపై యుద్ధం చేసేలా సరికొత్త పరిజ్ఞానంతో కూడిన మందులను తీసుకురావాలి. అందుకు అవసరమైన నిధులను ఆయా దేశాలు కేటాయించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top